
సుంకేసులకు కొనసాగుతున్న వరద
కర్నూలు సిటీ: కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు భారీగా నీరు విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో తుంగభద్ర నదిపై నిర్మించిన సుంకేసుల బ్యారేజీ(కోట్ల విజయభాస్కర్ బ్యారేజీ)కి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. సోమవారం ఉదయం 6 గంటలకు 62,500 క్యుసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. సాయంత్రం 6 గంటలకు 57 వేల క్యుసెక్కులకు చేరుకుంది. దీంతో బ్యారేజీ నుంచి ఉదయం 17 గేట్ల ద్వారా 66,589 క్యుసెక్కులు.. సాయంత్రం 59,310 క్యుసెక్కులను 15 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
ఏడుగురు డిప్యూటీ ఎంపీడీఓలకు పోస్టింగ్‌లు
కర్నూలు(అర్బన్): ఇటీవల పదోన్నతి పొందిన ఏడుగురు డిప్యూటీ ఎంపీడీఓలకు పోస్టింగ్ ఇచ్చినట్లు జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. పదోన్నతి పొందిన జేమ్స్ కృపవరంను కర్నూలు, ఎ.నాగరాజును చిప్పగిరి, కె.నాగరాజును హాలహర్వి, ఎ.విజయలక్ష్మిని మద్దికెర, జి.మహేశ్వరిని సి.బెళగల్, పి.గోపాలను దేవనకొండ, జిఎంఏ కిషోర్ కుమార్‌ను కోడుమూరు మండలానికి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు.
పీజీ, బీటెక్ సెమిస్టర్‌పరీక్షలు ప్రారంభం
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో సోమవారం పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీటెక్ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పీజీ నాల్గవ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలకు 489 మందికిగాను 415 మంది విద్యార్థులు హాజరుకాగా బీటెక్ 4, 6 సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ, 3, 5, 7 సప్లిమెంటరీ పరీక్షలకు 243 మందికిగాను 241 మంది విద్యార్థులు హాజరైనట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఉడతా వెంకట బసవరావు, రెక్టార్ ఆచార్య ఎన్‌టీకే నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బోయ విజయ్‌కుమార్ నాయుడు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.
9న గురుకులాల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్
కర్నూలు(అర్బన్): జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాసంస్థల్లో 5వ తరగతి, ఇంటర్మీడియట్‌లో మిగిలిన సీట్ల భర్తీకి ఈనెల 9న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లాల కోఆర్డినేటర్ డాక్టర్ ఐ.శ్రీదేవి తెలిపారు. సోమవారం సాయంత్రం ఆమె విలేకరులతో మాట్లాడుతూ 5వ తరగతిలో బాలురకు రెండు సీట్లు మాత్రమే ఉన్నాయని, అవి కూడా ఎస్టీ, బీసీలకు మాత్రమేనన్నారు. ఇంటర్మీడియెట్‌లో బాలురకు ఎంపీసీలో 6, బైపీసీలో 5, సీఈసీలో 36 సీట్లు భర్తీ చేయాల్సి ఉందన్నారు. 5వ తరగతిలో బాలికలకు 70, ఇంటర్మీడియెట్‌లో బాలికలకు ఎంపీసీలో 70, బైపీసీలో 26 సీట్లను భర్తీ చేయాల్సి ఉందన్నారు. ఈ కౌన్సిలింగ్‌కు గురుకుల ప్రవేశ పరీక్ష రాసిన బాలికలు మాత్రమే హాజరుకావాలన్నారు. 9న ఉదయం 10 గంటలకు 5వ తరగతి సీట్ల భర్తీకి (బాలురు, బాలికలు) దిన్నెదేవరపాడులోని అంబేద్కర్ బాలికల గురుకులంలో హాజరుకావాలన్నారు.