
బాలిక ప్రాణం తీసిన నీటి గచ్చు
కోడుమూరు రూరల్: నీటి గచ్చు ఐదేళ్ల బాలిక ప్రాణం తీసింది. ఈ దుర్ఘటన కోడుమూరు మండలం వర్కూరు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లక్కసాగరం రామాంజినేయులుకు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. నాల్గవ కుమార్తె గాయత్రి (5)ని తోటి పిల్లలతో పాటు ఎప్పటిలాగే ఇంట్లో వదిలి తండ్రి రామాంజినేయులు పొలం పనులకు వెళ్లాడు. అయితే బాలిక గాయత్రి ఆటలాడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటి గచ్చులో పడిపోయింది. గాయత్రి కన్పించకపోవడంతో మిగిలిన పిల్లలు చుట్టుపక్కల వెతికి ఇంటిలోని గచ్చులో చూశారు. అప్పటికే బాలిక అపస్మారక స్థితికి చేరుకుంది. విషయం తెలుసుకున్న తండ్రి రామాంజినేయులు ఇంటికి చేరుకుని పాపను బతికించుకునేందుకు కోడుమూరు ప్రభుత్వాసుపత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే బాలిక మృతిచెందినట్లు వైద్యులు చెప్పడంతో రోదిస్తూ గ్రామాన్ని చేరుకున్నారు.
పిడుగుపాటుతో
18 మేకలు మృతి
ఆదోని రూరల్: మండలంలోని పాండవగల్ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి పిడుగుపాటుకు గురై 18 మేకలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన కొరవన్నగారి తిక్కయ్యకు చెందిన 3, కప్పట్రాళ్ల రాందాసుకు చెందిన 4, చింతకుంట నరసయ్యకు చెందిన 3, జెల్లీ గోకర్లకు చెందిన 4, జెల్లీ చిన్నలక్ష్మన్నకు చెందిన 4 మేకలు మృతిచెందాయి. రాత్రిపూట పొలంలో ఆపిన సమయంలో పిడుగు పడడంతో మేకలు మృతిచెందాయని గొర్రెల కాపరులు చెప్పారు. మేకల మృతితో దాదాపు రూ.2 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందన్నారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
దేవనకొండ: అప్పుల బాధతో దేవనకొండకు చెందిన గిడ్డిగారి ప్రకాష్(48) అనే రైతుసోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న మూడు ఎకరాల పొలంలో పంటలు పండిస్తూనే సెంట్రింగ్ పనులు చేస్తూ ప్రకాష్ జీవనం సాగించేవాడు. గత రెండు సంవత్సరాల నుంచి పంటలు సరిగా పండలేదు. ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి దాదాపు రూ.15 లక్షలు దాకా అప్పులపాలయ్యాడు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక నిత్యం సతమతమవుతూ ఉండేవాడు. భార్య పిల్లలు బంధువుల శుభకార్యానికి వెళ్లగా ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం ఎంతసేపటికీ తలుపులు తీయకపోవడంతో కిటికీలో నుంచి చూడగా శవమై వేలాడుతున్నాడు. దీన్ని గమనించిన స్థానికులు పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు ఇచ్చారు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈతకు వెళ్లి బాలుడి మృతి
ప్యాపిలి: మండల పరిధిలోని ఎస్ రంగాపురంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామాంజనేయులు, సునీతల కుమారుడు చరణ్ (10) సోమవారం ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదివిన చరణ్.. వేసవి సెలవులు కావడంతో తోటి మిత్రులతో కలసి ప్రతిరోజూ గ్రామ శివారులోని కుంటలో ఈత నేర్చుకునేవాడు. రోజులాగే సోమవారం కూడా ఈతకు వెళ్లాడు. నీటిలో మునిగిపోకుండా వీపునకు ప్లాస్టిక్ డబ్బా కట్టుకుని కాసేపు ఈత కొట్టాడు. తర్వాత ప్లాస్టిక్ డబ్బా తొలగించి కుంటలోకి దూకి బయటకు రాలేకపోయాడు. కొద్ది సేపటి తర్వాత అదే కుంటలో ఈత కొడుతున్న కొందరు అడుగున తమకు ఏదో తగులుతోందని గుర్తించారు. వెంటనే అందరూ కలిసి అడుగున ఉన్న చరణ్‌ను బయటకు తీశారు. అప్పటికే బాలుడు మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న బాలుడి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.

బాలిక ప్రాణం తీసిన నీటి గచ్చు