
ఐటీఐ.. అవకాశాలు మెండుగా..!
● పారిశ్రామిక శిక్షణా కేంద్రాల్లో ప్రవేశాలకు తొలి దశ నోటిఫికేషన్ విడుదల ● వివిధ ట్రేడుల్లో అడ్మిషన్లకు మే 24న తుది గడువు
నంద్యాల(న్యూటౌన్): పదవ తరగతి పరీక్షలు పూర్తయి ఫలితాలు కూడా వచ్చాయి. ఇప్పుడు విద్యార్థులు పది అనంతర కోర్సులపై దృష్టి కేంద్రీకరించారు. ఇప్పటికే పాలిసెట్, రెసిడెన్షియల్ ప్రవేశ పరీక్షలు పూర్తయ్యాయి. పలువురు విద్యార్థులు వారి ఆసక్తిని బట్టి ఏ కోర్సులో చేరాలా అని ఆలోచన చేస్తున్నారు. అధిక శాతం మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్‌లో చేరగా, పలువురు విద్యార్థులు పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సులకు ప్రాధాన్యమిస్తున్నారు. పదవ తరగతి పూర్తి చేయగానే త్వరితగతిన ఉపాధి పొందేందుకు ఐటీఐ కోర్సులు ఒక చక్కని బాటను ఏర్పాటు చేస్తాయని సాంకేతిక నిపుణులు చెబుతారు. ఐటీఐ కోర్సు పూర్తి చేసినవారు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఒక చక్కటి అవకాశంగా భావించవచ్చు. ఉద్యోగం, ఉపాధితో పాటు స్వయం ఉపాధికిసైతం ఐటీఐ కోర్సు దోహదపడుతుంది. జిల్లాలో ఐదు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఏడాది, రెండేళ్ల కాలపరిమితితో 1,084 సీట్లు ఉ న్నాయి. 16 ప్రైవేట్ యాజమాన్యంలో 2225 సీట్లు ఉన్నాయి.ఐటీఐ కోర్సుల్లో ప్రవేశానికి మే 24వ తేదీ తుది గడువుగా ఉపాధి, శిక్షణ శాఖ ప్రకటించింది.
రెండేళ్ల కాలపరిమితి కోర్సులు..
ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, డ్రాఫ్ట్‌మెన్ సివిల్, ఆర్‌అండ్ ఏసీ టెక్నాలజీ, మెకానికల్ మోటార్ వెహికల్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్సిస్టిట్యూట్ మెకానిక్, టర్నర్, మెచినిస్ట్.
ఏడాది కాలపరిమితి కోర్సులు..
మెకానిక్ డీజిల్, సీవోపీఏ, వెల్డర్, సూయింగ్ టెక్నాలజీ, పీపీవో.
డ్రోన్ టెక్నాలజీపై స్వల్ప కాలిక కోర్సు ప్రారంభం..
ఈ ఏడాది నంద్యాల జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐలో నూతనంగా డ్రోన్ టెక్నాలజీ పై ఆరు నెలల వ్యవధి గల కోర్సును ప్రవేశ పెట్టారు. ప్రభుత్వ ఐటీఐలో 20 సీట్లు ఉన్న ఈ కోర్సును ఈ ఏడాది నుంచి ప్రారంభిస్తున్నారు. వ్యవసాయం, సర్వే, షూటింగ్స్‌లో డ్రోన్ టెక్నాలజీ వినియోగం పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 10 ఐటీఐల్లో డ్రోన్ టెక్నాలజీ కోర్సును ప్రవేశ పెట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
ఐటీఐలో చేరగోరే విద్యార్థులు మే 24వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు పరిశీలన సమయంలో సమీప ప్రభుత్వ ఐటీఐలకు విధిగా హాజరు కావాలి. కౌన్సెలింగ్ షెడ్యూల్ వివరాలను విద్యార్థుల మొబైల్‌కు పంపిస్తాం. పదవ తరగతిలో విద్యార్థి పొందిన మార్కులు, రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం అడ్మిషన్స్ ఉంటాయి.
– ప్రసాదరెడ్డి, జిల్లా ప్రభుత్వ ప్రైవేటు ఐటీఐ కళాశాలల జిల్లా కన్వీనర్, నంద్యాల

ఐటీఐ.. అవకాశాలు మెండుగా..!