
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
కర్నూలు (టౌన్) : గుజరాత్‌లో ఈనెల 24వ తేదీన నిర్వహించనున్న జాతీయ స్థాయి ఖేలో ఇండియా ఫుట్‌బాల్ పోటీలకు కర్నూలు నగరానికి చెందిన ఎం. రేణుకా, బి. భువనేశ్వరీలు ఎంపికయ్యారు. ఎంపికయిన క్రీడాకారులను శుక్రవారం జిల్లా ఫుట్‌బాల్ సంఘం అధ్యక్షులు ముప్పా రాజశేఖర్ తన కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయి ఖేలో ఇండియా ఫుట్‌బాల్ పోటీలకు కర్నూలు క్రీడాకారులు ఎంపిక కావడం గర్వకారణమన్నారు. జాతీయ స్థాయిలో మంచి ప్రతిభ కనబరచాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఫుట్‌బాల్ సంఘం ప్రతినిధులు శ్రీనివాసులు, వేణుగోపాల్, పాల్ విజయ్‌కుమార్, శ్రీధర్, కోచ్ బ్రహ్మాకుమార్ పాల్గొన్నారు.
మల్లికార్జునపల్లిలో నిలిచిన
ఉపాధి పనులు
● వేతనాలపై ప్రశ్నించినందుకు అధికారుల నిర్వాకం
ఆలూరు: హాలహర్వి మండలం మల్లికార్జునపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులు నిలిచిపోయాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. పనిదినాలకు తక్కువగా వేతం వచ్చిదంటూ ఉపాధి పథకం టెక్నికల్ అసిస్టెంట్ రాజశేఖర్‌తో గ్రామానికి చెందిన కూలీలు వాగ్వాదానికి దిగారు. ఈ మేరకు ఈనెల 3న టెక్నికల్ అసిస్టెంట్ రాజశేఖర్, ఫీల్డ్ అసిస్టెంట్ నాగరాజుతో కలిసి వెళ్లి మస్టర్లు తదితర అంశాలను విచారించి చేసిన పనులను కొలతలు వేశారు. అయితే తక్కువ కొలతలను చూపిస్తున్నారని కూలీలు ఈరప్ప, మల్లికార్జున, చాంద్‌బాషా ఈశ్వరప్ప తదితరులు టీసీ రాజశేఖర్‌ను నిలదీశారు. దీంతో ఆ రోజు నుంచి గ్రామంలో పనులు నిలిపేశారు. కాగా శుక్రవారం కూడా పనులు జరగలేదు. పనులు నిలిపివేయడంపై హాలహర్వి ఏపీఓ చక్రవర్తి దృష్టికి తీసుకెళ్లగా అలాంటిదేమీ లేదని సమాధానం దాటవేశారు.