
గిరిజనులకు రాజకీయ ప్రాధాన్యత ఏదీ
● ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ కై లాస్‌నాయక్
కర్నూలు(అర్బన్): కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో గిరిజనుల రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో విస్మరించిందని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ కై లాస్‌నాయక్ విమర్శించారు. శుక్రవారం స్థానిక సీ క్యాంప్‌లోని డ్రైవర్స్ అసోసియేషన్ కార్యాలయంలో గిరిజన బంజారా ముఖ్య నేతల రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కై లాస్ నాయక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తున్నా, గిరిజనులకు ఒక్క రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి కూడా ఇవ్వలేదన్నారు. రాయలసీమ ప్రాంతంలో అధిక సంఖ్యలో ఉన్న బంజారా కులస్థులు రాజకీయ అభ్యర్థుల గెలుపోటములను శాసించే స్థాయిలో ఉన్నారన్నారు. అలాగే బీసీ, ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా ఆయా సామాజిక వర్గాలకు చెందిన వారి ఆర్థికస్థితిగతులను మెరుగుపరచుకునేందుకు రుణాలు అందించే ప్రక్రియ ప్రారంభమైందని, గిరిజన కార్పొరేషన్ ద్వారా నేటికి ఎలాంటి ప్రక్రియ ప్రారంభించకపోవడం శోచనీయమన్నారు. రాయలసీమ విశ్వ విద్యాలయంలో ఓ గిరిజన అధికారిపై ప్రజా సంఘాల నాయకులు ఫిర్యాదు చేయడం సరికాదన్నారు. బంజారాలు మాట్లాడే భాషను 8వ షెడ్యూల్‌లో చేర్చాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలన్నారు. సమావేశంలో నాయకులు నాగరాజునాయక్, నేణావత్ రామునాయక్, కాలు నాయక్, బాలునాయక్, రాజునాయక్, వెంకటేష్‌నాయక్, శ్రీనునాయక్, శంకర్‌నాయక్, బీ మద్దిలేటి, సీమ కృష్ణరాథోడ్, జయరామ్ నారాయణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.