
ఉచితాన్ని తుంగలో తొక్కి!
● తుంగభద్ర నదిలో టీడీపీ నాయకుల
అక్రమ తవ్వకాలు
● ప్రాంతాలుగా పంచుకుని
అడ్డగోలుగా తరలింపు
● విభేదాలు రావడంతో
పంచాయితీ చేసిన టీడీపీ నేత
● కలిసి దోపిడీ చేయాలని సలహా!
కర్నూలు(టౌన్): అధికారంలోకి వచ్చాక ధనార్జనే ధ్యేయంగా టీడీపీ నాయకులు పెచ్చుమీరిపోతున్నారు. సహజ వనరులను యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. కర్నూలు శివారులోని తుంగభద్ర నదిలో ఇసుక పేదలకు అందకుండా ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. ప్రాంతాలు వారీగా దందా సాగిస్తున్నారు. ఈ విషయంలో ఇటీవల గొడవలు జరగడంతో టీడీపీ నేత పంచాయతీ చేసి కలసి దోపిడీ చేయాలని సలహా ఇచ్చినట్లు సమాచారం.
దోపిడీ ఇలా...
ప్రజలకు ఉచిత ఇసుక ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. అందుకు విరుద్ధంగా టీడీపీ నాయకులు ఇసుక దోపిడీ చేస్తున్నారు. కర్నూలు నగర శివారు ప్రాంతాల్లో రీచ్‌లు లేకున్నా తుంగభద్ర నదిలో నిత్యం ఇసుక దందా సాగుతోంది. ఇంటి నిర్మాణాల కోసం ఒంటెద్దు బండ్లలో ఇసుకను తీసుకుపోవచ్చు అంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా.. అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. కర్నూలు నగర శివారులోని తుంగభద్ర పరిసర ప్రాంతాల నుంచి ప్రతి రోజూ పగలు, రాత్రి అన్న తేడా లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ట్రాక్టర్ ఇసుకను రూ. 3 వేలకు అమ్ముకుంటున్నారు. రీచ్‌ల నుంచి మాత్రమే ట్రాక్టర్లు, టిప్పర్లలో తరలించాల్సి ఉంది. అయితే తుంగభద్ర నదిలో రీచ్‌లు లేకున్నా ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్నారు.
అడ్డుకుని.. హంగామా సృష్టించి
తుంగభద్ర ఇసుకను అక్రమంగా తరలించడంలో కర్నూలు మండలానికి చెందిన టీడీపీ నేత అనుచరులు బృందంగా ఏర్పడ్డారు. అలాగే మంత్రి పేరు చెప్పి కార్పొరేటర్ కుటుంబం సభ్యులు సైతం ఇసుకను తరలిస్తున్నట్లు విమర్శలు ఉన్నారు. ఇసుక దోపిడీకి వీరు ప్రాంతాలను ఏర్పచుకున్నారు. ఇటీవల మంత్రి పేరు చెప్పి సంకల్‌బాగ్, పాత తుంగభద్ర పంపింగ్ హౌస్ వద్ద ఇసుకను తరలిస్తుండగా కర్నూలు మండల టీడీపీ నేత అనుచరులుగా ఉన్న వారు అడ్డుకున్నారు. ఇసుక ట్రాక్టర్‌కు అడ్డంగా పడుకొని నానా హంగామా సృష్టించారు. ‘ తమ ప్రాంతంలో ఇసుకను ఎలా తరలిస్తున్నారు’ అంటూ గొడవకు దిగారు.
టీడీపీ నేత పంచాయితీ
కర్నూలు నగర శివారులోని తుంగభద్ర నదిలో ఇసుక తరలించే విషయంలో జరుగుతున్న గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు టీడీపీ నేత పంచాయతీ చేశారు. ఇరు వర్గాల వారితో మాట్లాడారు. ఈ పంచాయితీలో ‘ ఇసుక మనది.. కలసి పంచుకుందాం.. గొడవలు వద్దు.. అందరం పంచుకుందాం’ అన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ‘మీ ప్రాంతంలోకి మా వారు.. వారి ప్రాంతంలోకి మీరు రాకూడదు’ అంటూ టీడీపీ నేత ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఇదీ దుస్థితి..
● తుంగభద్ర నది నుంచి ప్రెవేటు ట్రాక్టర్ల
అసోసియేషన్ వారు సైతం టీడీపీ నేతల
నాయకుల పేర్లు చెప్పి ఇసుకను
తరలిస్తున్నారు.
● ఒంటెద్దు బండ్లకు ఉచితంగా ఇసుకను
తీసుకునే పోయే అవకాశం ప్రభుత్వం
కల్పించినా పట్టించుకునే ఽనాధుడు లేడు.
● ఇసుక దందాపై అధికారులు తమకేం
సంబంధం లేదని వ్యవహరిస్తున్నారు.

ఉచితాన్ని తుంగలో తొక్కి!