వ్యాధి బయటపడే కాలం | - | Sakshi
Sakshi News home page

వ్యాధి బయటపడే కాలం

May 16 2025 12:52 AM | Updated on May 16 2025 12:52 AM

వ్యాధి బయటపడే కాలం

వ్యాధి బయటపడే కాలం

కర్నూలు(హాస్పిటల్‌): జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ పారిశుధ్యం అధ్వానంగా ఉంది. మురుగుకాల్వలు నిండిపోవడంతో దోమలకు అవి ఆవాసంగా మారాయి. తరచూ వర్షాలు కురవడంతో ఖాళీ ప్రదేశాల్లో నీరు నిలుస్తోంది. అందులో దోమలు గుడ్లు పెట్టి అవి లార్వాలుగా మారి దోమల ఉత్పత్తి పెరుగుతోంది. ప్రధానంగా డెంగీ కారక ఏడిస్‌ ఈజిప్టై దోమ దోసెడు నీళ్లు చాలు అందులో పెరుగుతుంది. ఈ కారణంగా ఇళ్లు, దుకాణాల పరిసరాల్లో వాడి పారేసిన కొబ్బరి బోండాలు, కొబ్బరి చిప్పలు, పాతటైర్లు, ఇతర వస్తువుల్లో నీరు నిల్వ ఉండి అందులో డెంగీ దోమలు పెరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు మున్సిపల్‌, పంచాయతీ సిబ్బంది పారిశుధ్య కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించకపోవడం, గత ప్రభుత్వం చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం మంగళం పాడటంతో దోమల ఉత్పత్తి అధికమవుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు జిల్లాలో ఆదోని మండలంలో ఒకటి, పెద్దకడుబూరులో 2, మంత్రాలయంలో 2, కర్నూలులో 9, ఓర్వకల్‌లో 3, పత్తికొండలో 4, కల్లూరులో 5, గూడూరులో 4, ఎమ్మిగనూరులో 10, సి.బెళగల్‌లో 13, దేవనకొండలో 3, తుగ్గలిలో 2, క్రిష్ణగిరిలో 3, గోనెగండ్లలో 4, వెల్దుర్తిలో 3, ఆస్పరిలో 3, నందవరంలో 1, చిప్పగిరిలో 2, కోడుమూరులో 5, కౌతాళం మండలంలో ఒకటి, కర్నూలు అర్బన్‌లో 16, ఆదోని అర్బన్‌లో 1, ఎమ్మిగనూరు అర్బన్‌లో 4, గూడూరు అర్బన్‌లో 3 కేసులు నమోదయ్యాయి.

డెంగీ ఎలా వస్తుందంటే...!

ఆర్ధో వైరస్‌ తరగతికి చెందిన నాలుగు రకాల డెంగీ వైరస్‌ల వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇది మనిషి నుంచి మనిషికి ఏడిస్‌ ఈజిప్టై దోమల ద్వారా సంక్రమిస్తుంది. ఆడ ఏడిస్‌ ఈజిప్టై దోమకాటు ద్వారా ఈ వ్యాధి వస్తుంది. ఈ జాతి దోమ పైన నల్లని, తెల్లని చారలు ఉండటం వల్ల దీనిని టైగర్‌ దోమ అని కూడా పిలుస్తారు. ఈ దోమలు ఇంటిలోపల, ఆవరణలో ఉంటాయి. డెంగీ వైరస్‌తో ఇన్‌ఫెక్ట్‌ అయిన దోమలోనే గాకుండా దోమ గుడ్లలో కూడా ఈ వైరస్‌ ఉంటుంది. కాబట్టి త్వరితగతిన ఎక్కువ మందికి ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈ దోమ మంచినీటి నిల్వలలో మాత్రమే గుడ్లు పెడుతుంది. ఈ వైరస్‌ వల్ల ఒకటి కంటే ఎక్కువసార్లు డెంగీ రావచ్చు. ఈ వ్యాధిని డెంగీ జ్వరం, డెంగీ హెమరేజ్‌ జ్వరం, డెంగీ షాక్‌ సిండ్రోమ్‌గా విభజిస్తారు.

వ్యాధి నిర్ధారణ..

డెంగీ జ్వరం నిర్ధారించేందుకు మొదటి వారంలో ఎన్‌ఎస్‌1 ర్యాపిడ్‌ కిట్‌తో పరీక్షను అన్ని పీహెచ్‌సీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహిస్తారు. రెండవ వారంలో వ్యాధి తీవ్రతను బట్టి ధ్రువీకరణ పరీక్ష ‘మాక్‌ ఎలీసా’ పరీక్షలు బోధనాసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో చేస్తారు. ఈ పరీక్షలో ధ్రువీకరించితేనే అది డెంగీగా నిర్ధారణ అవుతుంది.

డెంగీ నివారణకు చర్యలు

జిల్లా వ్యాప్తంగా డెంగీ నివారణ చర్యలు తీసుకుంటున్నాం. కేసు నమోదైన ఇంటి చుట్టుపక్కల 50 ఇళ్లల్లో పైరిత్రమ్‌ స్ప్రే చేస్తున్నాం. నీళ్లు నిలిచిన చోట యాంటిలార్వా చర్యలు తీసుకుంటున్నాం. దోమలు ఎక్కువగా ఉంటే మున్సిపల్‌, పంచాయతీ శాఖల సహకారంతో ఫాగింగ్‌ ఆపరేషన్‌ చేస్తున్నాం. వెయ్యి జనాభాలో ఇద్దరి కంటే ఎక్కువ పాజిటివ్‌ కేసులు వచ్చిన ప్రాంతంలో 45 రోజులకు ఒకసారి డీడీటీ స్ప్రే చేయిస్తున్నాం.

– నూకరాజు, జిల్లా మలేరియా అధికారి, కర్నూలు

డెంగీ వైరస్‌ ఇన్‌ఫెక్ట్‌ అయిన దోమకాటు తర్వాత మూడు నుంచి 14 రోజుల్లో డెంగీ వ్యాధి రావచ్చు. ఈ వైరస్‌తో ఇన్‌ఫెక్ట్‌ అయిన తర్వాత సాధారణంగా 80 శాతం మందికి దానంతటదే తగ్గిపోతుంది. వీరికి ఎర్రటి దద్దుర్లు వచ్చిన సమయంలో రక్తంలో ప్లేట్‌లెట్లు తగ్గినా సాధారణ స్థితికి చేరుకుంటారు. మిగతా రెండు రకాలలో (డెంగీ హెమరేజ్‌, డెంగీ షాక్‌ సిండ్రోమ్‌) రక్తంలో ఈ ప్లేట్‌లెట్లు బాగా తగ్గడం వల్ల వీరికి ఆసుపత్రిలో చికిత్స అవసరం అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement