
ఆర్టీసీ బస్సు, లారీ ఢీ
● నలుగురికి గాయాలు
ఓర్వకల్లు: కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై పూడిచెర్ల బస్సు స్టేజీ వద్ద గురువారం ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొనడంతో నలుగురికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఎస్‌ఐ సునీల్ కుమార్ తెలిపిన వివరాల మేరకు కర్నూలు నుంచి నంద్యాల వైపు వెళ్తున్న లారీకి ఆవుల మంద అడ్డురావడంతో లారీ డ్రైవర్ తన లారీని అకస్మాత్తుగా స్లో చేయడంతో, వెనక వస్తున్న ఆళ్లగడ్డ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తూ లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పోలూరుకు చెందిన నిర్మల అనే వృద్ధురాలి తలకు రక్తగాయాలు కాగా, జోత్స్న, వసంతకుమారి, ధర్మతేజ స్వల్పంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని స్థానిక సీహెచ్‌సీ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఈ ఘటనపై ఇరు వాహనదారులు ఫిర్యాదు చేయకుండా, రాజీ కుదుర్చుకోవడంతో కేసు నమోదు చేయలేదని ఎస్‌ఐ తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
కోసిగి: తుంబిగనూరు గ్రామానికి చెందిన తలారా నాగరాజు (27) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామంలో చేపల చెరువులలో రోజు వారి కూలి పనులుకు వెళ్లి జీవనం సాగిస్తున్న యువకుడు కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. భార్య నాగమ్మ పుట్టినిల్లు ఆదోని మండలం జాలమంచి గ్రామం. ఆమె 15 రోజులుగా నాగమ్మ చెల్లెలు పెళ్లి ఉందని పుట్టినింటికి వెళ్లిపోయింది. బుధవారం రాత్రి కడుపు నొప్పి తాళలేక నాగరాజు జీవితంపై విరక్తి చెంది తుంగభద్ర నది కాల్వ ఒడ్డున రేకుల షెడ్‌వద్ద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీస్‌లకు సమాచారం అందించడంతో ఎస్‌ఐ హనుమంత రెడ్డి, ఏఎస్‌ఐ నాగరాజులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. మృతుడు తల్లి ఉచ్చీరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతినికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
పిడుగు పాటుకు గొర్రెల కాపరి మృతి
చాగలమర్రి: చిన్నబోధనం మజరా గ్రామమైన తిప్పన పల్లె గ్రామ సమీపంలో గురువారం తెల్లవారుజామున పిడుగుపాటుకు ఓ గొర్రెల కాపరి మృతి చెందాడు. వైఎస్సార్ జిల్లా తొండురు మండలం కోరవానిపల్లె గ్రామానికి చెందిన చంద్రశేఖర్ (29)తో పాటు మరో ఐదుగురు కలసి సుమారు వెయ్యికి పైగా గొర్రెలతో 15 రోజుల క్రితం తిప్పనపల్లెకు చేరుకున్నారు. గ్రామంలోని బీడు భూముల్లో జీవాలను మేపుతూ అక్కడే ఉంటున్నారు. చంద్రశేఖర్ వేప చేట్టు కింద నిద్రిస్తుండగా గురువారం తెల్లవారు జామున చెట్టుపై పిడుగు పడింది. ఆ శబ్దానికి చంద్రశేఖర్ గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందగా, అక్కడే ఉన్న మూడు మేకలు కూడా మృత్యువాత పడ్డాయి. సమాచారం అందుకున్న ఏఎస్‌ఐ షేక్ అబ్దుల్ నబి సంఘటనా స్థలానికి చేరుకుని గొర్రెల కాపరుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న చంద్రశేఖర్ మృతితో సంఘటన స్థలంలో తల్లి పద్మావతి, కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ