
అదృశ్యం కేసులో ఆద్యంతం మలుపులు
● గత నెల 26వ తేదీన అదృశ్యమైన
వ్యక్తి హత్య?
● అనుమానితులను విచారిస్తున్న
పోలీసులు
సాక్షి, టాస్క్ ఫోర్స్: మండల కేంద్రమైన గడివేములకు చెందిన గొర్రెల కాపరి గువ్వల రాజు అదృశ్యం కేసు ఆద్యంతం మలుపులు తిరుగుతోంది. తన తమ్ముడు రాజు కనిపిచడం లేదని అన్న జనార్దన్ గత నెల 26వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. విచారణ చేస్తుండగా గ్రామంలోని ఓ రైతు మొక్క జొన్న పొలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఆనవాళ్లు లభించడంతో ఈనెల 10వ తేదీన అనుమానాస్పద మృతి కింద మరో కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గువ్వల రాజును కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేసి, శవాన్ని మాయం చేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. గొర్రెల కాపరి రాజు కొన్నేళ్లుగా ఒంటరిగా ఉంటూ మద్యానికి బానిసయ్యాడు. ఇదే క్రమంలో భార్యాపిల్లలు కూడా అతడిని వదిలేశారు. దీంతో అక్కడక్కడా గొర్రెల కాపరిగా వెళ్తూ వచ్చే కూలీ డబ్బుతో జీవించేవాడు. అయితే మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన కొంత మంది యువకులు కలిసి రాజును హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసినట్లు సమాచారం.దారుణంగా హత్య చేసి గుర్తు పట్టకుండా మృత దేహంపై యాసిడ్, పెట్రోల్ పోసి దహనం చేసినట్లు సమాచారం. ఆ తర్వాత అస్తిపంజరంలో చిన్న ఎముకలను విసిరేసి పెద్ద ఎముకలను పిండి చేసి పొలంలో పడేసినట్లు తెలిసింది. అనుమానితులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. హత్యకు పాల్పడిన స్థలానికి నిందితుల ను తీసుకెళ్లి విచారణ చేశారు. నిందితులను రెండు రోజుల్లో అరెస్టు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.