
అనుమానాస్పద స్థితిలో గర్భిణి మృతి
డోన్ టౌన్: పట్టణంలో గురువారం ఓ గర్భిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కోడుమూరు మండలం గోరంట్ల గ్రామానికి చెందిన కురువ జయమ్మ, శ్రీనివాసుల దంపతుల మూడవ కుమార్తె చిన్నారి(18)కి కృష్ణగిరి మండలం ఎరుకలచెర్వు గ్రామానికి చెందిన దుబ్బ నరసింహులు, అనుమక్క దంపతుల కుమారుడు ఎల్లప్పతో నాలుగు నెలల క్రితం వివాహమైంది. ఎల్లప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ డోన్ పట్టణంలోని కోట్ల స్టేడియం సమీపంలో తల్లిదండ్రులతో కలసి ఉంటున్నారు. అతని భార్య చిన్నారి ప్రస్తుతం మూడు నెలల గర్భిణి. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ.. గురువారం మధ్యాహ్నం ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మ హత్యకు పాల్పడిందని చిన్నారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి కుటుంబీకులు, బంధువులు పెద్ద ఎత్తున డోన్‌కు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా తమ బిడ్డను అత్తింటి వాళ్లే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పట్టణ పోలీసులు డోన్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించి విచారణ చేపట్టారు. ఈ విషయంపై పట్టణ సీఐ ఇంతియాజ్‌బాషాను వివరణ కోరగా.. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారణ చేసి కేసు నమోదు చేస్తామన్నారు.
నాలుగు నెలల క్రితం వివాహం
అత్తింటి వారే చంపి ఆత్మహత్యగా
చిత్రీకరించారని మృతురాలి
తల్లిదండ్రుల ఆరోపణ