భక్తులకు ఉచితంగా లడ్డూల పంపిణీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దీక్ష విరమణలలో తయారు చేసిన లడ్డూలను దేవస్థానం గురువారం ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఉచితంగా పంపిణీ చేసింది. భవానీ దీక్ష విరమణలను పురస్కరించుకుని దేవస్థానం భారీగా లడ్డూలను తయారు చేసింది. అయితే చివరి రోజైన సోమవారం భక్తులు, భవానీల రద్దీ అంతంత మాత్రంగానే ఉండటంతో లడ్డూ విక్రయాలు తగ్గాయి. దీంతో దేవస్థానం వద్ద భారీగా లడ్డూ స్టాక్ ఉండటంతో గురువారం ఆలయ ప్రాంగణంలోని పలు ప్రాంతాల్లో భక్తులకు వాటిని ఉచితంగా పంపిణీ చేశారు. అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చే మార్గంలో రెండు ప్రదేశాల్లో, మహా మండపం లిప్టు ఎదుట, ఘాట్‌రోడ్డు మార్గంలో డోనర్ సెల్ వద్ద సేవా సిబ్బంది, ఆలయ అర్చకులకే లడ్డూలను పంపిణీ జరిగింది. మరో వైపున భక్తులు ఇదే అవకాశంగా ఒక్కోక్కరు ఒకటికి, రెండు సార్లు క్యూలైన్లో నిల్చోని లడ్డూలను పొందారు. దీంతో ఘాట్‌రోడ్డులోని ఓం టర్నింగ్, మహా మండపం దిగువన లడ్డూ కౌంటర్లు విక్ర యాలు లేక వెలవెలపోయాయి. దీక్ష విరమణలకు ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసిన తిరుగు ప్రయాణమైన శానిటేషన్, సెక్యూరిటీ, దేవదాయ శాఖ, పోలీసు, ఇతర విభాగాలకు చెందిన వారికి సైతం దేవస్థానం లడ్డూ ప్రసాదాలను పంపిణీ చేయడం విశేషం. అయితే ఆలయంలో విధులు నిర్వహించే సిబ్బందికి మాత్రం ఉచిత లడ్డూ ప్రసాదాలు అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


