మహిళలకు ఇళ్లలోనూ రక్షణ కరువు
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయని.. కనీసం ఇళ్లల్లో కూడా మహిళలు స్వేచ్ఛగా ఉండలేని భయానక వాతావరణం నెలకొనడం సిగ్గుచేటని వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగ్‌నగర్‌లోని నార్త్‌జోన్ తహసీల్దార్, మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయం సమీపంలో బుధవారం గంజాయి బ్యాచ్ వీరంగంతో గాయపడిన గుమ్మళ్ల కుసుమ కుటుంబ సభ్యులను వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి ఆయన గురువారం పరామర్శించారు. గంజాయి బ్యాచ్ సభ్యులు చేసిన ఆగడాల గురించి బాధితురాలిని అడిగి తెలుసుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీసిన వీడియోలను చూసి నివ్వెరపోయారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ సభ్యుల ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోయిందని.. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని విమర్శించారు.
టీడీపీ నాయకుల వత్తాసు సిగ్గుచేటు..
అమాయక ప్రజల ధన, మాన, ప్రాణాలను తీయడానికి కూడా వెనుకాడని గంజాయి, బ్లేడ్ బ్యాచ్ సభ్యులకు టీడీపీ నాయకులు వత్తాసు పలకడం సిగ్గుచేటని గౌతమ్‌రెడ్డి విమర్శించారు. ఇళ్లల్లో చొరబడి రాళ్లు, క్రికెట్ బ్యాట్లు, కారం ప్యాకెట్లతో అలజడి చేసి ఇళ్లను ధ్వంసం చేసి చిన్నపిల్లలను సైతం బూతుపురాణాలతో చంపేస్తామని బెదిరించిన మానవ మృగాలను కాపాడేందుకు టీడీపీ నాయకులు పోలీసులపై ఒత్తిళ్లు తీసుకురావడం దారుణమన్నారు. ఇటువంటి విధానాలను రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని.. కూటమి ప్రభుత్వ పాలకులు ఇటువంటి విధానాలను వీడకుండా నేరాలను, నేరస్తులను ప్రోత్సహిస్తే ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సివస్తోందని హెచ్చరించారు. పోలీసులు అధికార పార్టీ నాయకుల చేతుల్లో పావులుగా మారకుండా చట్టపరంగా.. న్యాయపరంగా నడుచుకోవాలని కోరారు.
వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్‌రెడ్డి
సింగ్‌నగర్‌లో గంజాయి బ్యాచ్ చేతిలో గాయపడిన మహిళ కుటుంబానికి పరామర్శ


