కేంద్రాలపై ప్రభుత్వం చిన్న చూపు
గత వైభవం నేడేది..
అందరికీ సాధారణ డైట్ ఇస్తాం..
● పౌషకాహార లోపంతో చిన్నారులు
● అంగన్వాడీల్లో స్పెషల్ డైట్
ఊసే ఎత్తని సర్కారు
● దొడ్డుబియ్యం ఇస్తుండటంతో
తినలేకపోతున్న చిన్నారులు
● గత వైభవం కోల్పోయిన
అంగన్వాడీలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): చిన్నారులకు సరైన పోషకాహారం అందడం లేదు. ఫలితంగా ఎదుగుదల లోపిస్తోంది. వయస్సుకు తగిన ఎత్తు, బరువు సక్రమంగా ఉండటం లేదు. ప్రభుత్వం సైతం అలాంటి పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపడం లేదు. ముఖ్యంగా పేద ప్రజలు నివసించే ప్రాంతా ల్లోని అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లల్లో 20 నుంచి 30 శాతం మంది ఇలాంటి పిల్లలు ఉన్నట్లు సమా చారం. అందుకు ఇటీవల జక్కంపూడి ప్రాంతంలోని ఒక అంగన్వాడీ సెంటర్‌ను ఓ జిల్లా అధికారి తనిఖీ చేయగా, అక్కడ ఉన్న 20 మందిలో 8 మంది పోషకాహార లోపంతో ఉన్నట్లు గుర్తించడమే నిదర్శనంగా కనిపిస్తోంది. వారికి ప్రత్యేక డైట్ ఏమైనా ఇస్తున్నారా అంటే అదేమీ లేదని తేలింది. అంతేకాదు పోషకాహార లోపం ఉన్న పిల్లలకు ఇచ్చే ప్రత్యేక డైట్‌పై అంగన్వాడీలకు సైతం సరైన అవగాహన లేక పోవడం కొసమెరుపు.
లావు బియ్యం, పుచ్చిన కందిపప్పు..
అంగన్వాడీల్లో చిన్నారులకు ప్రతిరోజూ మధ్యాహ్నం పప్పు, ఆకుకూరల భోజనంతో పాటు, ఉడికించిన గుడ్డు, వంద మిల్లీలీటర్ల పాలు ఇవ్వాలని మెనూలో ఉంది. కానీ అక్కడ పెట్టే భోజనం చిన్నారులు తినలేక పోతున్నట్లు చెబుతున్నారు. రేషన్ దుకాణాల్లో ఇచ్చే దొడ్డు(లావు) బియ్యమే అంగన్వాడీలకు ఇస్తుండటం, ఒక్కోసారి కందిపప్పు సైతం నాణ్యతాలోపం ఉండటంతో చిన్నారులు తినలేక పోతున్నట్లు చెబుతున్నారు. నూనె, ఇతర సరుకులు కూడా అంత నాణ్యత ఉండటం లేదు. దీంతో అంగన్వాడీల్లోని చిన్నారులకు సరైన పోషకాహారం అందడం లేదు. మరోవైపు పోషకాహారలోపం ఉన్న వారికి అదనంగా డైట్ ఇవ్వాల్సి ఉన్నా, అది సరిగా అమలు కావడం లేదు. దీంతో పోషకాహార లోపం చిన్నారులకు శాపంలా మారుతుంది.
గర్భిణులకూ నాసిరకమే..
ఏడాదిగా గర్భిణులకు సరఫరా చేసే రాగి పిండిలో ఇసుక తగులుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. నాసిరకం రాగి పిండి సరఫరా చేయడంతో ఇలా జరుగుతోందని వారు అంటున్నారు. అంతేకాకుండా చిక్కీ కూడా గత ప్రభుత్వంలో ఇచ్చినది నాణ్యతగా ఉండేదని, కానీ ఇప్పుడు తినలేక పోతున్నామంటున్నారు. మరోవైపు పాలు లీటర్ ప్యాకెట్స్ ఇస్తున్నారని, అవి ఫ్రిడ్జ్ లేని వాళ్లు ఎలా స్టోరేజ్ చేసుకుని తాగాలని ప్రశ్నిస్తున్నారు. అరలీటరు ప్యాకెట్స్ ఇస్తే ప్రయోజనకరంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు.
రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకూ వైఎస్సార్ సీపీ పాలనలో అంగన్వాడీలపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే నిత్యావసరాలు నాణ్యతతో ఉండేలా చూశారు. ముఖ్యంగా సన్నబియ్యం సరఫరా చేయడంతో చిన్నారులు ఇష్టంగా తినేవారు. ఎవరైనా పోషకాహార లోపంలో చిన్నారులకు ఉంటే వారికి ప్రత్యేక డైట్ అందించేవాళ్లు. అలా మూడు నెలలు ఇచ్చినా బరువు పెరగకపోతే, వారికి న్యూట్రీషియన్ రిహాబిలిటేషన్ సెంటర్(ఎన్ఆర్సీ)కు రిఫర్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు స్పెషల్డైట్ సక్రమంగా అందక పోగా, ఎన్ఆర్సీ సెంటర్‌కు కూడా రిఫర్ చేయాలనే ఆలోచన కూడా చేయడం లేదు. దీంతో చిన్నారులకు బరువు తక్కువగా ఉంటూ, చలాకీగా ఉండలేక పోతున్నారు.
అంగన్వాడీల్లో పిల్లలందరికీ రొటీన్ డైట్ ఇస్తాం. పోషకాహార లోపం ఉన్న పిల్లలు ఉంటే, వారికి జీర్ణ లోపం ఉందేమో గుర్తించి, వారికి ఆహారం ఎలా పెట్టాలో తల్లికి కౌన్సెలింగ్ ఇస్తాం. స్పెషల్ డైట్ అంటూ ఏమీలేదు.
– రుక్సానా,
పీడీ, ఐసీడీఎస్, ఎన్టీఆర్ జిల్లా


