భయంతో హత్య చేసిన మైనర్ బాలుడు
గుడ్లవల్లేరు: నాలుగు గోడల మధ్య కట్టేసి కొడితే... పిల్లి అయినా పులి అవుతుందన్న చందంగా... ఒక పాత నేరస్తుడిని ఒక మైనర్ బాలుడు హత్య చేసిన ఉదంతం ఆలస్యంగా బయట పడింది. తనతో పాటు తన వారిని పాత నేరస్తుడు అస్తమానం వేధిస్తున్నాడన్న భయంతో ఒక మైనర్ బాలుడు ఆ పాత నేరస్తుడిని హత్య చేసిన సంఘటన గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామ శివారు పసుభొట్లపాలెంలో జరిగింది. గుడ్లవల్లేరు పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం గుడివాడ సీఐ ఎస్.ఎల్.ఆర్. సోమేశ్వరరావు, గుడ్లవల్లేరు ఎస్.ఐ ఎన్.వి.వి.సత్యనారాయణ నిర్వహించిన విలేకరుల సమావేశంలో హత్య చేసిన నిందితుడితో పాటు దాచిన వ్యక్తుల్ని ప్రదర్శించారు. పోలీసుల కథనం మేరకు ఈ నెల 17న ఉదయం 7 గంటల సమయంలో పసుభొట్లపాలెంలోని దళితవాడలో చిన్నం వసంతరావు ఇంటికి ఎదురుగా సిమెంట్ రోడ్డు పక్కగా పంట బోదె గట్టుపై ఒక వ్యక్తి గాయాలతో చనిపోయి పడి ఉన్నాడని పోలీసులకు సమాచారం వచ్చింది.
మృతుడు పాతనేరస్తుడు
ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించగా... అదే గ్రామానికి చెందిన రేమల్లి వెంకట్రావు(45) అలియాస్ ముసలిగా గుర్తించారు. తల, ముఖంపై ఎవరో బలమైన ఆయుధంతో కొట్టి చంపి ఉంటారని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఎటువంటి ఆధారాలు లేని క్లిష్టమైన ఈ కేసును సీఐ సోమేశ్వరరావు, ఎస్.ఐ సత్యనారాయణ ఛేదించారు. చనిపోయిన వెంకట్రావుతో పాటు ఒక మైనర్ బాలుడు అత్యంత స్నేహంగా ఉండేవాడు. అదే గ్రామంలో పదవ తరగతి వరకు చదివిన ఆ బాలుడు చదువు అబ్బక చెడు అలవాట్లకు లోనయ్యాడు. వెంకట్రావుతో పాటు ఆ బాలుడు పనులకు వెళుతూ ఉండేవారు. వచ్చిన డబ్బులతో మద్యం తాగి తిరుగుతూ స్నేహంగా మెలిగేవారు.
మద్యం ఇప్పించమని తరచుగా వేధింపులు
ఈ బాలుడిని వెంకట్రావు మందు ఇప్పించమని అస్తమానం వేధించేవాడు. ఇప్పించకపోతే చంపుతానని బెదిరించేవాడు. గతంలో వెంకట్రావు చేసిన హత్యను ఆ బాలుడికి కథలు కథలుగా చెప్పి భయ భ్రాంతులకు గురిచేస్తూ బెదిరించేవాడు. ఆ భయంతో వెంకట్రావు ఏం చెప్పినా...ఆ బాలుడు తప్పనిసరై చేసేవాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 16న ఇద్దరూ పనికి వెళ్లి వచ్చారు. వేర్వేరు చోట్ల, విడివిడిగా ఎవరు మందు వాళ్లు తాగారు. అనంతరం ఆ బాలుడు తనకు అన్నయ్య వరుసైన చిన్నం విజయకుమార్ అలియాస్ సుబ్బు అనే వ్యక్తి ఇంటిలో మరొక బాలుడితో కలిసి పడుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో వెంకట్రావు ఆ బాలుడు పడుకున్న ఇంటి తలుపు తట్టాడు. ఆ ఇంటి యజమాని విజయకుమార్ భార్య బత్తుల కావ్యశ్రీ తలుపు తీయకుండానే లేడని లోపలి నుంచే సమాధానం చెప్పింది. కొద్దిసేపటి తర్వాత వెంకట్రావు మళ్లీ ఆ ఇంటికి వెళ్లి ఆ బాలుడు కావాలంటూ వేధించసాగాడు. కావ్యశ్రీ మళ్లీ తలుపు తీయకుండానే బాలుడు ఇక్కడ లేడని చెప్పింది. అప్పుడు ఆమెను అబద్ధం చెబుతున్నావని వెంకట్రావు తిట్టాడు. వాడిని ఎందుకు దాస్తున్నావని అసభ్యపదజాలంతో దూషించాడు. వాడి సంగతి, నీ సంగతి తేలుస్తానంటూ తిట్టాడు.
అతనితో ఎప్పటికైనా తనకు ప్రాణగండమని..
ఇదంతా లోపలి నుంచి గమనిస్తున్న ఆ బాలుడు వెంకట్రావు బతికి ఉంటే ఎప్పటికైనా తన ప్రాణానికి ప్రమాదం తప్పదనే భయంతో పక్కనే ఉన్న బలమైన ఇనుప రాడ్డును తీసుకుని వెంకట్రావు వెనుకే వెళ్లాడు. పక్కనే ఉన్న మరో బాలుడు ఆపుతున్నా ఆగలేదు. వెంకట్రావు తలపై బలంగా రెండు, మూడు సార్లు కొట్టగా వెంకట్రావు అక్కడే పడిపోయాడు. ఆ రాత్రి సమయంలో అప్పుడే పనికి వెళ్లి తిరిగి వచ్చిన విజయకుమార్ పడిపోయిన వెంకట్రావును పరిశీలించగా చనిపోయాడని నిర్ధారించుకున్నాడు. వెంటనే ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్లి కావ్యశ్రీకి, విజయకుమార్ తల్లి జయకు వెంకట్రావు చనిపోయాడని చెప్పారు. ఏమీ జరగనట్టుగానే ఆ రాత్రి వాళ్లు పడుకున్నారు. ఉదయాన్నే కావ్యశ్రీ ఇనుప రాడ్డును ఎవరికీ అనుమానం రాకుండా తీసుకుని వెళ్లి, వాళ్ల అమ్మమ్మ ఇంట్లోని నీళ్ల బావిలో పడవేసింది. విజయకుమార్, జయ కూడా నేరాన్ని ఎవరికీ చెప్పకుండా దాచారు. పోలీసులు తమ పద్ధతిలో కేసు దర్యాప్తు చేసి హత్య కేసును ఛేదించారు. ఈ నెల 19వ తేదీ రాత్రి 7.30 గంటలకు నేరం చేసిన వారితో పాటు నేరం దాచిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నేరానికి ఉపయోగించిన ఇనుప రాడ్డు, దుస్తులను సీజ్ చేశారు. అనుమానాస్పద మృతిని హత్యగా కేసు నమోదు చేసి నిందితుల్ని కోర్టుకు అప్పగించారు.
పసుభొట్లపాలెం హత్య కేసును
ఛేదించిన పోలీసులు


