
చిలకలపూడి(మచిలీపట్నం): మార్చి 15వ తేదీ నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియెట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలు బుధవారంతో ముగిశాయి. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో రెండో సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలను నిర్వహించారు. కృష్ణాజిల్లాలో 16,898 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 16,510 మంది విద్యార్థులు హాజరయ్యారు. 388 మంది విద్యార్థులు హాజరుకాలేదు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి 31,521 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 30,779 మంది విద్యార్థులు హాజరయ్యారు. 742 మంది విద్యార్థులు హాజరుకాలేదు. ఈ పరీక్షలో మాల్‌ప్రాక్టీస్ జరగలేదని పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు ఆర్‌ఐవో పి. రవికుమార్ తెలిపారు.
పకడ్బందీగా పరీక్షలు
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఈ పరీక్షలకు సంబంధించి 148 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారులను నియమించటంతో పాటు పరీక్ష కేంద్రాల్లో 3,120 ఇన్విజిలేటర్లను నియమించారు. పది మంది సిట్టింగ్ స్క్వాడ్, ఎనిమిది ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసి మాల్ ప్రాక్టీస్ జరగకుండా పర్యవేక్షించారు. ఈ పరీక్షల్లో ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం ఆరుగురు విద్యార్థులను డీబార్ చేసినట్లు ఆర్‌ఐవో తెలిపారు.
ఏప్రిల్ 1 నుంచి మూల్యాంకనం..
ఇంటర్మీడియెట్ పరీక్షలకు సంబంధించి ఏప్రిల్ 1వ తేదీ నుంచి మూల్యాంకనం చేయనున్నట్లు ఆర్‌ఐవో పి. రవికుమార్ తెలిపారు. ఇంగ్లిషు, లెక్కలు, సివిక్స్, తెలుగు, హిందీ జవాబు పత్రాల మూల్యాంకనం విజయవాడలోని ఎస్‌ఆర్‌ఆర్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాలలో నిర్వహిస్తామన్నారు.
పరీక్షలు పూర్తవడంతో విజయవాడలో విద్యార్థినుల ఉత్సాహం