సాగు సాగక! | - | Sakshi
Sakshi News home page

సాగు సాగక!

Jun 16 2026 11:46 PM | Updated on Jun 16 2026 11:46 PM

● 13 మండలాల్లో లోటు వర్షపాతం ● ఇప్పటికీ కురవని భారీ వర్షాలు ● విత్తనాలు విత్తుకునేందుకు అన్నదాతల ఎదురుచూపులు

వాన లేక..

దహెగాం: మృగశిర కార్తె ప్రవేశించి పది రోజులు కావొస్తున్నా నేటికీ జిల్లాలో భారీ వర్షాలు కురవలేదు. రైతులు పత్తి విత్తనాలు విత్తుకోవడానికి చేలు దుక్కి దున్ని సిద్ధం చేసుకుంటున్నా కనీసం మట్టిపెల్లలు కరగకపోవడంతో సాగు పనులు ఆలస్యమవుతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయా లేదా అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గతేడాది జూన్‌ 15 నాటికి 51.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈసారి ఇప్పటివరకు 70.7 మి.మీ.ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 43.5 మి.మీ. మాత్రమే కురిసింది. అంటే 38 శాతం లోటు ఉంది. సిర్పూర్‌(యు), కెరమెరి మండలాల్లో మాత్రమే అధిక వర్షపాతం నమోదు కాగా, మిగతా 13 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది.

4.50 లక్షల ఎకరాల్లో సాగు

జిల్లావ్యాప్తంగా వానాకాలం సీజన్‌లో 4.50 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో ప్రధానంగా 3.70 లక్షల ఎకరాల్లో పత్తి, 50 వేల ఎకరాల్లో వరి సాగు ఉండనుంది. మిగతా 30 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కానున్నాయి. గతేడాది ఖరీఫ్‌ ఆరంభంలో మోస్తరు వర్షాలు కురవడంతో జూన్‌ మొదటి వారంలోనే పత్తి విత్తనాలు విత్తుకున్నారు. వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ట్రాక్టర్‌తో కల్టివేటర్‌ కొడుతుండగా, వర్షాలు లేని ప్రాంతాల్లో దుక్కులు దున్నుతున్నారు. మరోవైపు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పనులు చేయలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. ప్రతిరోజూ మబ్బులతో గాలిదుమారం వీస్తోందే గానీ వర్షం మాత్రం పడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వరుణుడి కోసం

గతేడాది మే చివరి వారం, జూన్‌ మొదటి వారంలో వర్షాలు కురిశాయి. కానీ ఈసారి మే నెలలో ఆశించి న స్థాయిలో వర్షాలు పడలేదు. చిరుజల్లులకే విత్తనాలు విత్తితే నష్టపోవాల్సి వస్తుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. గతంలో కూడా తొలకరి వర్షాలకే విత్తనాలు విత్తగా, వరుణుడు ముఖం చాటేయడంతో విత్తనాలు మాడిపోయి అన్నదాతలు నష్టాలను చవిచూశారు. ఒకటికి రెండుసార్లు విత్తనాలు వేసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. భూమి 2 నుంచి 3 ఫీట్ల లోతు వరకు తడిసిన తర్వాతనే విత్తనాలు విత్తుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఈ ఫొటోలో ట్రాక్టర్‌ పక్కన నిలబడ్డ రైతు పేరు రత్నం మధుకర్‌. ఈ సీజన్‌లో 20 ఎకరాల్లో పత్తి సాగు చేయడానికి భూమిని ట్రాక్టర్‌తో దుక్కి దున్ని సిద్ధం చేస్తున్నాడు. ఆదివారం రాత్రి బొర్లకుంట శివారులో మోస్తరు వర్షం కురిసింది. దీంతో కల్టివేటర్‌ కొట్టిస్తున్నాడు. ఇప్పటివరకు భారీ వర్షాలేవీ కురవలేదని, వరుణుడి రాక కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొంటున్నాడు. ఇలా.. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ రైతులు చేలు సిద్ధం చేసి భారీ వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు.

చేతిలో మట్టిపెల్ల పట్టుకుని చూపిస్తున్న ఈ రైతు పేరు జాటోత్‌ గోపాల్‌. దహెగాం మండలం కల్వాడ గ్రామం. ఈ సీజన్‌లో సొంతంగా ఉన్న ఐదెకరాలే కాకుండా, మరో పదెకరాలను రూ.1.50 లక్షలకు కౌలుకు తీసుకున్నాడు. పత్తి సాగుకు కౌలుకు తీసుకున్న భూమిని దుక్కి దున్నించినా సరైన వర్షం లేక ఇంకా మట్టిపెల్ల లు కూడా కరగలేదు. గతేడాది జూన్‌ 10 నాటికే వర్షాలు కురవడంతో పత్తి విత్తనాలు పెట్టానని చెబుతున్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement