ఆసిఫాబాద్: జిల్లాలో అర్హులందరికీ బ్యాంకు రుణాలు అందిస్తామని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం 2025– 26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక రుణాల ప్రగతిపై బ్యాంకు, ఇతర శాఖల అధికారులతో జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహంచారు. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ రాజేశ్వర్ జోషి హాజరయ్యారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 6,294 స్వయం సహాయక సంఘాలకు రూ.411 కోట్లు రుణ లక్ష్యం కాగా, 2,609 సంఘాలకు మాత్రమే రుణాలు అందించడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన సంఘాలకు వెంటనే రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. మహిళలు, వ్యాపారం చేసుకునే వారికి పీఎంఈజీపీ, పీఎం ఉపాధి కల్పన పథకం కింద చేతి వృత్తుల వారికి, అర్హులైన యువతకు రుణాలు అందించాలన్నారు. పరిశ్రమలు, డెయిరీలు, గొర్రెల పెంపకం, చేనేత, మత్స్య పరిశ్రమల స్థాపనతోపాటు వ్యవసాయ రంగం, విద్యారుణాలు, గృహ నిర్మాణ రుణాలు అందించి ప్రోత్సహించాలన్నారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు మాట్లాడుతూ నూతన రుణ ప్రణాళిక 2026–27 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకర్లు ధనికులు, వ్యాపారవేత్తలకే కాకుండా గ్రామీణ ప్రజలు, సామాన్యులకు రుణాలందించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ సందర్భంగా 2026– 27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,545.80 కోట్ల రుణ ప్రణాళికను ఆమోదించారు. ఇందులో అత్యధికంగా వ్యవసాయ రంగానికి రూ.2,642 కోట్లు కేటాయించారు. సమావేశంలో ఎల్‌డీఎం హరిప్రసాద్, ఏడీసీసీ బ్యాంకు డీజీఎం ఏ.భాస్కర్‌రెడ్డి, వివిధ బ్యాంకుల అధికారులు, మేనేజర్లు, సెక్టార్ అధికారులు, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు.


