ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో నీట్ ప్రశాంతంగా ము గిసింది. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా, ఉదయం 11 గంటల వరకే విద్యార్థులు జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలోని పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. 11.30 గంటల నుంచి ప్రధాన గేట్ వద్ద పోలీసులు, సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. అనంతరం బయోమెట్రిక్ తీసుకుని లోపలికి పంపించారు. పరీక్ష సమయం కంటే నిమిషం ముందు వచ్చిన ఖమానా, కౌటాలకు చెందిన నలుగురు విద్యార్థుల వద్ద గుర్తింపు కార్డులు లేకపోవడంతో అనుమతించలేదు. దీంతో వారు వెనుదిరిగి వెళ్లిపోయారు. మొత్తం 316 మంది విద్యార్థులకు 303 మంది హాజరు కాగా, 13 మంది గైర్హాజరయ్యారని నీట్ కోఆర్డినేటర్ లక్ష్మీనరసింహం తెలిపారు. కలెక్టర్ కె.హరిత పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసి వివరాలు తెలుసుకున్నారు. అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు.


