సింగరేణిలో మరో సంఘం | - | Sakshi
Sakshi News home page

సింగరేణిలో మరో సంఘం

May 4 2026 7:37 AM | Updated on May 4 2026 7:37 AM

తెలంగాణ బొగ్గుగని కార్మిక సమాఖ్య (టీజీబీకేఎస్‌) పేరిట కొత్త యూనియన్‌ కెంగర్ల మల్లయ్య సారథ్యంలో ఏర్పాటు గత నెల 27నే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి నేడు మేడారంలో లాంఛనంగా ఆవిర్భావం

శ్రీరాంపూర్‌: సింగరేణిలో మరో కార్మిక సంఘం పురుడుపోసుకోనుంది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సమాఖ్య (టీజీబీకేఎస్‌) పేరిట కార్మికుల ముందుకు వస్తోంది. సుధీర్ఘకాలం కార్మిక నేతగా పని చేస్తున్న గోదావరిఖనికి చెందిన టీబీజీకేఎస్‌ మాజీ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య సారథ్యంలో ఏర్పడుతోంది. ఏప్రిల్‌ 27న రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్‌లో ఈ–2926 నంబర్‌తో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయింది. కంపెనీలోని పరిస్థితులపై కొన్ని నెలలుగా పలువురు కార్మిక సంఘాల నేతలు, మేధావులతో సంప్రదింపులు జరిపిన తరువాత ఈ నూతన సంఘానికి భీజం పడింది. సోమవారం మేడారంలోని సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద ఈ సంఘాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. జూన్‌లో మహాసభ ఏర్పాటు చేసి సంఘం నిర్మాణం చేయనున్నారు. కొత్త సంఘం ఆవిర్భావంపై సింగరేణి కార్మికుల్లో చర్చ జరుగుతోంది. కార్మికుల హక్కుల పరిరక్షణ, సింగరేణి సంస్థ పరిరక్షణే ధ్యేయంగా ఈ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. సింగరేణిలో ఇప్పటికే ఐదు జాతీయ సంఘాలతోపాటు తెలంగాణ భావజాలంతో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) కొనసాగుతోంది. మరికొన్ని ప్రాంతీయ సంఘాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీజీబీకేఎస్‌ ఏర్పాటుపై ట్రేడ్‌ యూనియన్‌ నేతలు దృష్టి సారించారు.

బొగ్గు గని పుట్టిన రోజే..

మే 4కు బొగ్గు గని చరిత్రలో ప్రత్యేక స్థానముంది. 1774లో జార్ఖండ్‌లోని రాంచీలో దేశంలోనే మొదటి బొగ్గు గని ఏర్పాటైంది. ఆ రోజే బొగ్గు గని కార్మికుడు పుట్టినట్లు భావిస్తారు. దీంతో ఆ రోజును గుర్తుగా కార్మికులు ఎప్పుడూ స్మరించుకునేలా నేడు యూనియన్‌ను ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం కంపెనీ వ్యాప్తంగా కెంగర్ల మల్లయ్య అనుచరులు, సీనియర్‌ కార్మిక సంఘం నేతలు, కార్మికులు మేడారానికి వెళ్తున్నారు.

కంపెనీని కాపాడేందుకే..

ప్రస్తుతం కంపెనీ అస్థిత్వం కోల్పోయే ప్రమాదముంది. కొత్త గనులు లేవు. ఉద్యోగాలు తగ్గుతున్నాయి. ఉన్న గనులను ప్రైవేట్‌ పరం చేస్తున్నారు. ఇప్పటికే కంపెనీకి రూ.50వేల కోట్ల మొండి బకాయిలు రావాల్సి ఉంది. దీంతో ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంది. భవిష్యత్‌ అగమ్యగోచరంగా తయారైంది. ఇలాగే కొనసాగితే సంస్థను అంబానీకో, అదానీకో అప్పగించే అవకాశముంది. 30ఏళ్ల క్రితం సింగరేణికి ఇలాంటి దుస్థితి వస్తే అప్పుడు కాపాడుకున్నాం. ఇప్పుడు మళ్లీ ఆ రోజులు వచ్చాయి. కంపెనీని కాపాడుకునేందుకు కార్మికుల హక్కులను పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో నూతన సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా యూనియన్‌ను నడిపిస్తాం.

– కెంగర్ల మల్లయ్య, టీజీబీకేఎస్‌ వ్యవస్థాపకుడు

Advertisement
 
Advertisement
Advertisement