ఆసిఫాబాద్: అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్) పథకానికి ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. మే 1నుంచి జూలై 31వరకు గడువు విధించింది. గడువులోపు చెల్లించేవారికి పీజులో 25శాతం రాయితీ ప్రకటించింది. ఏడాదిన్నర క్రితం ప్రభుత్వం ఇలాంటి అవకాశం ఇవ్వగా కొందరే వినియోగించుకున్నారు. ఈ క్రమంలో మరోసారి రాయితీ అవకాశం అవకాశం కల్పించడం ప్లాట్ల యజమానులకు ఊరట లభించింది. తెలంగాణ ప్రభుత్వం 2020 ఆగస్టు 31న ఈ పథకాన్ని రాష్ట్రంలో ప్రారంభించింది. అక్రమ లే అవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు జీవో 131 జారీ చేసింది.
జిల్లాలో 7,698 దరఖాస్తులు
ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ ప్రారంభమవడంతో జిల్లా వ్యాప్తంగా 7,698 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్లాట్లు కలిగిన యజమానులు ఒక్కో ప్లాట్‌కు రూ.వెయ్యి చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో అధికారులు పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులో 25శాతం రాయితీ ప్రకటించింది. వీటిలో 1,014 మంది దరఖాస్తుదారులు రూ.1.92 కోట్లు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించగా, పరిశీలించిన అధికారులు 78 మందికి ప్రొసీడింగ్‌లు జారీ చేశారు. ఎల్1, ఎల్2, ఎల్3 మూడు దశల్లో అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది. ఎల్1 స్టేజీలో పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, ఎల్2లో డీపీవో, ఎల్3లో అదనపు కలెక్టర్ పరిశీలించిన తర్వాత చివరగా అధికారుల ధ్రువీకరణ అనంతరం ఎల్‌ఆర్‌ఎస్ ప్రొసీడింగ్ పత్రాలు జారీ చేస్తారు. ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుందని భావించినప్పటికీ గతంలో ఆశించిన స్పందన రాలేదు. 13శాతం దరఖాస్తు దారులే ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించారు. దరఖాస్తు దారులు ఫీజు చెల్లించి ఏడాది గడుస్తున్నా 896 దరఖాస్తులు ఇంకా ఎల్1 స్టేజీలోనే ఉన్నాయి.
ఇలా వినియోగించుకోవాలి
ఎల్‌ఆర్‌ఎస్ పోర్టల్‌లో సిటిజన్ లాగిన్‌లోకి వెళ్లాలి. దరఖాస్తు నంబర్ లేదా ప్లాట్ వివరా లు ఇచ్చి పేమెంట్ స్టేటస్ చూడాలి. అనంత రం దరఖాస్తు స్థితి ఎల్1/ఎల్2/ఎల్3 చూసి పెండింగ్ ఫీజులు, వివరాలు తెలుసుకోవాలి. పోర్టల్‌లోనే నెట్ బ్యాంకింగ్ లేదా ఇతర పే మెంట్ ఆప్షన్ల ద్వారా చెల్లించవచ్చు. ప్రొసీడ్ ఫర్ పేమెంట్ కనిసిప్తే వెంటనే చెల్లింపు పూర్తి చేయాలి. కార్డ్ పేమెంట్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. దీంతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ చెల్లించే అవకాశముంది. 25శాతం రాయితీ ఆటోమేటిక్‌గా వర్తిస్తుంది. పూర్తి ఫీజు చెల్లింపు అనంతరం డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి.
వీటికి వర్తించదు
శిఖం, చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల్లోని లే అవుట్లలోని ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్ వర్తించదు. నిషేధిత జాబితాలో లేని లే అవుట్లు మాత్రమే పరిగణనలోకి వస్తాయి. లే అవుట్‌లో కనీసం 10 శాతం ప్లాట్లు ఇప్పటికే విక్రయించి ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే అర్హత ఉండదు. చెరువుకు 200 మీటర్ల దూరం ఉన్న ప్లాట్లకు రెవెన్యూ, నీటి పారుదల శాఖ అనుమతులు అవసరం.


