ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో నీట్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వైద్య వృత్తిలో చేరాలనే ఆశతో రోజుల తరబడి చదివిన విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. పరీక్షకు 316 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో 227 మంది బాలికలు, 89 మంది బాలురు ఉన్నారు. ఒక్కో గదిలో 24 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా 14 గదులు ఏర్పాటు చేశారు. పరీక్ష మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉంటుంది. విద్యార్థులను ఉదయం 11నుంచి 1.30గంటల వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. బయోమెట్రిక్ నిర్వహించి సెంటర్‌లోకి ప్రవేశ అనుమతి కల్పిస్తారు. 28మంది ఇన్విజిలేటర్లు, ఒక పరిశీలకుడు, ఇద్దరు చీఫ్ సూపరింటెండెంట్లతోపాటు ఇతర సిబ్బంది విధులు నిర్వహిస్తారు.
2024 అనుభవం నేపథ్యంలో..
జిల్లాలో 2024లో మొదటిసారిగా నీట్ నిర్వహించగా తప్పిదం జరిగింది. ఆధికారుల నిర్లక్ష్యంతో పేపర్ తారుమారైంది. పరీక్షా పేపర్లు రెండు సెట్లుగా రూపొందించగా ఒక సెట్ పేపర్ ఎస్‌బీఐలో మరో సెట్ కెనరా బ్యాంక్‌లో ఉంచారు. సెంటర్‌కు మెయిల్ ద్వారా ఎన్‌టీఏ అధికారులు పంపించిన నిబంధనల ప్రకారం ఎస్‌బీఐలో ఉంచిన సెట్ పేపర్ వాడాల్సి ఉండగా.. కెనరా బ్యాంక్‌లో ఉంచిన సెట్ పేపర్ తీసుకువచ్చి పరీక్ష రాయించారు. దేశవ్యాప్తంగా జీఆర్‌ఐడీయూ సెట్ నిర్వహించగా ఆసిఫాబాద్‌లో మాత్రం ఎన్‌ఏజీఎన్‌యూ సెట్ నిర్వహించారు. అయితే మిగతా సెంటర్లలో ప్రశ్నాపత్రానికి బార్ కోడ్ ఉండగా జిల్లా కేంద్రంలో ఇచ్చిన ప్రశ్నాపత్రాలకు ఎలాంటి బార్ కోడ్ లేకుండానే జవాబు పత్రాలు ఇచ్చారు. దీంతో 229 మంది విద్యార్థుల భవిష్యత్ అంధకారంలో పడింది. అప్పటి కలెక్టర్ చొరవ తీసుకుని కన్వీనర్‌తో మాట్లాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈసారి పరీక్షల నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కాగా, గత తప్పిదం పునరావృతం కాకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
విద్యార్థులకు సూచనలు
పరీక్ష పకడ్బందీగా నిర్వహిస్తాం
నీట్ నిర్వహణకు అన్ని ఏ ర్పాటు పూర్తి చేశాం. పరీక్ష కు 316 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. నిబంధనల మేరకు విద్యార్థులను క్షుణంగా తనిఖీ చేసి బయోమెట్రిక్ హాజరు నమోదు చేసిన తర్వాతే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తాం. పరీక్ష పకడ్బందీగా నిర్వహిస్తాం.
– లక్ష్మీనరసింహం, నీట్‌సిటీ కోఆర్డినేటర్


