‘అర్హులందరికీ సంక్షేమ ఫలాలు’ | - | Sakshi
Sakshi News home page

‘అర్హులందరికీ సంక్షేమ ఫలాలు’

May 3 2026 7:53 AM | Updated on May 3 2026 7:53 AM

ఆసిఫాబాద్‌: అర్హులందరికీ సంక్షేమ పథకలు అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హరిత తెలిపారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి సమావేశానికి అదనపు కలెక్టర్లు యువరాజ్‌ మర్మాట్‌, ఎం.డేవిడ్‌, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కామ్డే అనిల్‌కుమార్‌, ఏఎంసీ చైర్మన్‌ ఇరుకుల మంగ, మున్సిపల్‌ చైర్మన్‌ మెంగ్రె ఆకాశ్‌, వైస్‌ చైర్మన్‌ ఎండీ అహ్మద్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఇటీవల ప్రభుత్వం నియోజకవర్గంలో 36,179 కుటుంబాలకు కొత్త రేషన్‌ కార్డులు అందించి సన్నబియ్యం పంపిణీ చేస్తోందని చెప్పారు. రైతు భరోసా, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ లబ్ధిదారులకు సాయమందిస్తున్నట్లు తెలిపారు. వివిధ పథకాల ద్వారా అర్హులకు లబ్ధి చేకూర్చుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 4నుంచి 9వరకు నిర్వహించనున్న రైతు వారోత్సవాల్లో ప్రజాప్రతినిధులు, రైతులు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాపాలనను గాలికొదిలేసి ప్రచారానికే పరిమితమైందని ఆరోపించారు. కార్యక్రమంలో భాగంగా ఆర్డీవో లోకేశ్వర్‌రావు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమం గురించి వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు గ్యాస్‌ సిలిండర్‌పై రూ.500 సబ్సిడీ ఇస్తున్నట్లు తెలుపగా ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తంజేశారు. గ్యాస్‌ సబ్సిడీ పూర్తి స్థాయిలో అందడంలేదని విమర్శించారు. ఎమ్మెల్యేలను కాదని అధికార పార్టీ నాయకులకే ప్రాధాన్యత ఇస్తూ ప్రొటోకాల్‌ పాటించడంలేదని ఆరోపించారు. సింగరేణి ప్రాంతానికి రావాల్సిన రూ.80కోట్ల నిధులు విడుదల చేస్తే రోడ్లు, తాగునీటి సమస్య పరిష్కరించవచ్చని పేర్కొన్నారు. ఇతర నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు డీఎంఎఫ్‌టీ నిధులు ఇస్తుండగా, ఆసిఫాబాద్‌లో మాజీ ఎమ్మెల్యేకు కేటాయించారని ఆరోపించారు. కలెక్టర్‌ చొరవ తీసుకుని నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అనిల్‌కుమార్‌, మాట్లాడుతూ.. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వంపై విమర్శించడం తగదని సూచించారు. దీంతో కలెక్టర్‌ జోక్యం చేసుకుని.. ఇది రాజకీయ సమావేశం కాదని, వ్యక్తిగత విమర్శలు చేసుకోవద్దని కోరారు. వివిధ శాఖల అధికారులు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement