ఆసిఫాబాద్: ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఆశయ సాధనకు కృషి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాళోజీ జయంతి నిర్వహించారు. ఎస్పీ కాంతిలాల్‌పాటిల్, అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో ఎదుర్కొన్న కష్టాలను కాళోజీ నవలల ద్వారా తెలియజేశారన్నారు. అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క లక్ష మొదళ్లకు కదలిక తీసుకొస్తుందని చాటి చెప్పారన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి సజీవన్, డీటీవో రాంచందర్, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, పంచాయతీరాజ్ ఈఈ కృష్ణ, జిల్లా సహకార శాఖ అధికారి బిక్కు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఇసుక లభ్యతపై నివేదికలు రూపొందించాలి
జిల్లాలో ఇసుక లభ్యతపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదికలు రూపొందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మంగళవారం అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి నదులు, వాగులు, చెక్‌డ్యాములు, ప్రాజెక్టులు, చెరువుల్లో ఇసుక లభ్యతపై రెవెన్యూ గనులు, భూగర్భ శాఖ, నీటిపారుదల శాఖ, అటవీశాఖ, రోడ్డు భవనాల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు ఉమ్మడిగా క్షేత్రస్థాయికి వెళ్లి అంచనాలు రూపొందించి ఈ నెల 20లోగా నివేదికలు సమర్పించాలన్నారు. వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచి అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు. అనంతరం జిల్లా సర్వే కమిటీ నివేదికను టీజీఎండీసీ పంపిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తుందని తెలిపారు. జైనూర్‌లో సాండ్ బజార్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా గనుల శాఖ ఏడీ గంగాధర్, ఇరిగేషన్ ఈఈ గుణవంత్‌రావు తదితరులు పాల్గొన్నారు.