
ఓపీఎస్‌లకు వేతన వెతలు!
● ఆరు నెలలుగా ఔట్‌సోర్సింగ్ కార్యదర్శులకు అందని జీతాలు ● ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైనం ● పంచాయతీ పాలనపైనా ప్రభావం..
రెబ్బెన(ఆసిఫాబాద్): గ్రామ పరిపాలన, పారిశు ద్ధ్యం, తాగునీటి సరఫరా, మొక్కల సంరక్షణ.. ఇలా ప్రతీ పని సాఫీగా సాగేలా ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులను నియమించింది. రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శులు లేని ప్రాంతాల్లో పాలనపరమైన సమస్యలు పరిష్కరించేందుకు ఔట్‌సో ర్సింగ్ పద్ధతిలో సిబ్బందిని విధుల్లోకి తీసుకున్నారు. రెగ్యులర్ సిబ్బందితో సమానంగా విధులు నిర్వహిస్తున్న వీరిపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. వేతనాల్లో భారీ తేడా ఉన్నా.. సమాన విధులు నిర్వహిస్తున్నా సకాలంలో జీతాలు అందించడం లేదు. కుటుంబాల పోషణ, పంచాయతీ పాలనకు అవస్థలు పడుతున్నారు.
వడ్డీలకు అప్పులు తెచ్చి..
గ్రామ పంచాయతీల్లో సర్పంచులు పదవీలో ఉన్నంతవరకు పరిపాలన బాధ్యతలు వారు చూసుకున్నారు. వారి పదవీకాలం పూర్తయ్యాక ప్రభుత్వం ప్రతీ జీపీకి ఒక ప్రత్యేకాధికారిని నియమించింది. ప్రత్యేకాధికారులు కేవలం సంతకాలకే పరిమితమై.. పాలనపై పూర్తి చేతులెత్తారు. ఆ బాధ్యతంతా కార్యదర్శులపై పడింది. ప్రభుత్వం నుంచి పంచాయతీలకు నిధులు విడుదల కాకపోవడంతో ఏ సమస్య ఉన్నా కార్యదర్శులే పరిష్కరించాల్సి వస్తోంది. రెగ్యులర్ సిబ్బందికి ప్రతినెలా క్రమంతప్పకుండా రూ.వేలల్లో జీతాలు వస్తుండటంతో.. అందులో కొంత మొత్తాన్ని పంచాయతీ అవసరాలకు వెచ్చిస్తున్నారు. ఇక ఔట్ సోర్సింగ్ సిబ్బంది పరిస్థితి మాత్రం మూలిగే నక్కపై తాటికాయ పడినట్లవుతోంది. జీతాలు అందక ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారికి పంచాయతీ భారం తలనొప్పిగా మారుతోంది. వడ్డీలకు అప్పులు తెచ్చి పంచాయతీ అవసరాలను తీరుస్తున్నారు. రోజువారీ పారిశుద్ధ్య కార్యక్రమాల కోసం ట్రాక్టర్లకు డీజిల్ ఖర్చులు, స్టేషనరీ, పైపులైన్ల మరమ్మతులు, ఇతరాత్ర ఖర్చులకు కూడా నిధులు లేకపోవడంతో సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ పరంగా నిర్వహించే ఇతర కార్యక్రమాలు, గ్రామసభల నిర్వహణ వంటి ఖర్చులు తలకుమించిన భారంగా మారాయి. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల లేకపోవడంతో ఒక్కో పంచాయతీ కార్యదర్శి రూ.లక్ష వరకు అప్పు తెచ్చి ఖర్చు చేశారు.
పాలనపై ప్రభావం
ఔట్‌సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులకు ప్రతినెలా సక్రమంగా వేతనాలు అందకపోవడంతో ఆ ప్రభావం పంచాయతీ పాలనపై పడుతోంది. ప్రత్యేకాధికారి ఉన్నా పంచాయతీ నిర్వహణలో ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. సాధారణ సమస్యలను సైతం పరిష్కరించేందుకు ఖజానాలో చిల్లీగవ్వ లేదు. ట్రాక్టర్ల మెయింటనెన్స్, డీజిల్, పారిశుద్ధ్య నిర్వహణ, నర్సరీ, డంపింగ్‌యార్డు నిర్వహణ, పల్లె ప్రకృతివనాలు, శ్మశాన వాటికల నిర్వహణ, తాగునీటి సరఫరా, ట్యాంకుల క్లోరినేషన్ పనులు కార్యదర్శులే చేపడుతున్నారు. పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని పంచాయతీ జనరల్ ఖాతాల్లో జమ చేసినప్పటికీ.. ప్రభుత్వం ఆ నిధులను సైతం వినియోగించుకుంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దోమల నివారణకు కోసం ఫాగింగ్ పనులు, మురుగు నీరు నిల్వ ఉండకుండా గుంతలు పూడ్చడం, వర్షాలతో రోడ్లపై పడిన గుంతలకు మరమ్మతులు వంటి పనులు సాగడం లేదు. ప్రభుత్వం నుంచి నిధులు కాకపోయిన వేతనాలైనా సక్రమంగా అందితే.. అందులో నుంచి పంచాయతీ అవసరాలను తీర్చే అవకాశం ఉంటుందని ఓపీఎస్‌లు చెబుతున్నారు.
మూడు నెలల జీతాలు విడుదల
జిల్లాలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులకు మూడు నెలల వేతనాలను ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసింది. మరో రెండు, మూడురోజుల్లో వారికి అందిస్తాం. ఇంకా మూడు నెలలు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని సైతం ప్రభుత్వం నుంచి విడుదల కాగానే అందజేస్తాం. గ్రామాల్లో ఎక్కడ కూడా చిన్న సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.
– భిక్షపతి, జిల్లా పంచాయతీ అధికారి
ఆరు నెలలుగా అందట్లే..
జిల్లాలో 15 మండలాల పరిధిలో ప్రస్తుతం 52 మంది ఔట్‌సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నారు. వీరికి నెలకు సుమారు రూ.19వేలు చెల్లిస్తుండగా.. అందులో కాంట్రాక్టర్ కమీషన్, జీఎస్టీ, ఈపీఎఫ్, ఈఎస్‌ఐ వంటివి పోగా రూ.10,500 వరకు చేతికందుతున్నాయి. రెగ్యులర్ సిబ్బందితో సమానంగా విధులు నిర్వహిస్తున్న వీరికి అందిస్తున్న వేతనం అరకొరే. అయినా గ్రామాల్లో ఏ చిన్న సమస్య రాకుండా చక్కబెడుతున్నారు. రెగ్యులర్ కార్యదర్శులకు ప్రతినెలా 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్న ప్రభుత్వం.. ఔట్‌సోర్సింగ్ కార్యదర్శులకు మాత్రం మూడు నెలలకు ఒకసారి విడుదల చేస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఆరు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఉన్నతాధికారుల వద్ద ఎంత మొరపెట్టుకుంటున్నా.. రేపుమాపు అంటూ కాలయాపన చేస్తున్నారే తప్పా స్పందించడం లేదని వాపోతున్నారు. చేతిలో చిల్లీగవ్వ లేక కుటుంబాల పోషణ నానా తంటాలు పడుతున్నారు.