దర్జాగా కబ్జా!? | - | Sakshi
Sakshi News home page

దర్జాగా కబ్జా!?

Jul 3 2025 5:35 AM | Updated on Jul 3 2025 5:35 AM

దర్జా

దర్జాగా కబ్జా!?

● జిల్లా కేంద్రంలో అక్రమంగా వెలుస్తున్న టేలాలు ● మున్సిపాలిటీగా మారినా మారని తీరు ● అధికారులపై నేతల ఒత్తిళ్లు!

సాక్షి, ఆసిఫాబాద్‌: జిల్లా కేంద్రం అక్రమ టేలాలకు అడ్డాగా మారింది. ఇక్కడ ఖాళీ స్థలం ఉంటే చాలు రాత్రికి రాత్రి అక్రమంగా టేలాలు వెలుస్తున్నాయి. రాజకీయ నాయకుల అండదండలు కూడా తోడవడంతో ప్రధాన రహదారుల్లో యథేచ్ఛగా ఏర్పాటు చేస్తున్నారు. అధికారులు చోద్యం చూస్తున్నారే తప్పా చర్యలకు ఉపక్రమించడం లేదు. ఆసిఫాబాద్‌ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా రూపాంతరం చెంది ఏడాదికి పైగా గడిచినా అక్రమంగా టేలాలు నేటీకీ వెలుస్తుండం గమనార్హం. రహదారుల విస్తరణకు రాజకీయ నేతలు ఒత్తిడి తీసుకొచ్చి అక్రమ నిర్మాణాలు తొలగించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఆదాయానికి గండి

జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌక్‌ నుంచి వివేకా నంద చౌక్‌ మీదుగా ఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌ సమీపంలోని బాలికల పాఠశాల వరకు ఇరువైపులా... ఇటు వైపు డీఎస్పీ కార్యాలయం వరకు టేలాల సంస్కృతి కొనసాగుతోంది. సర్కారు స్థలంలో వాణిజ్య సముదాయాలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి రూ.లక్షల ఆదాయం సమకూరుతుంది. కానీ అక్రమంగా ఏర్పాటు చేసిన టేలాల నుంచి మున్సిపాలిటీ అధికారులు నామమాత్రంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. తద్వారా భారీగా ఆదాయం నష్టపోవాల్సి వస్తోంది. పైగా ఇష్టానుసారం రహదారిపై ఏర్పాటు చేయడంతో ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు. అయితే సంబంధిత యజమానులు మాత్రం వాటిని అద్దెకు ఇచ్చి రూ.వేలల్లో అర్జిస్తున్నారు. ఇక శనివారం సంత సమయంలో అయితే ఆ ప్రాంతంలో ప్రజలకు నరకమే. అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఎదుట టేలాలు ఏర్పాటు చేయడంతో అక్కడ టెండరు ద్వారా దుకాణాలు పొందిన యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. బాబాపూర్‌ వెళ్లే మార్గంలోని మర్రిచెట్టు చౌరస్తా వద్ద కూడా అక్రమార్కులు ఇష్టారాజ్యంగా టేలాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో మొదట పదుల సంఖ్యలో ఉండగా, అవి ప్రస్తుతం వందల సంఖ్యకు చేరడం గమనార్హం. రహదారులకు ఇరువైపులా ఎక్కడైనా ఖాళీ జాగా కనబడితే తొలుత చిన్నగా ఆక్రమించడం.. తర్వాత శాశ్వత షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో పంచాయతీ అధికారులు ఈ టేలాలను తొలగించే ప్రయత్నం చేశారు. కొందరు రాజకీయ నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి తేవడంతో అప్పట్లో ఆ ప్రయత్నం అధికారులు విరమించుకున్నారు. ఇదే విషయంపై ‘సాక్షి’ ఓ జిల్లా ఉన్నతాధికారి వివరణ కోరగా పేరు చెప్పడానికి ఇష్టపడని ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీ మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాక ఈ అక్రమ టేలాలు అన్నింటినీ తొలగిస్తామని స్పష్టం చేశారు.

స్థానిక నేతల్లో కుదరని ఏకాభిప్రాయం

అధికారపార్టీ, ప్రతిపక్ష పార్టీ నేతలు ఎవరికివారే యుమునా తీరే అన్న చందంగా వ్యవహరించడంతో టేలాల తొలగింపు కార్యక్రమం అప్పట్లో అటకెక్కింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యే కలిసి రహదారుల అభివృద్ధిపై దృష్టి సారిస్తే ఫలితం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అలాగే మున్సిపాలిటీ అధికారులు కూడా చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. అసిఫాబాద్‌ మున్సిపాలిటీ మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించి అమలుచేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొంటున్నారు.

కలెక్టర్‌ కన్నెర్ర..!

జిల్లా కేంద్రంలోని అంకుసాపూర్‌కు వెళ్లే మార్గంలో పీటీజీ ఆశ్రమ పాఠశాలకు ఆనుకుని కొన్ని అక్రమ నివాసాలు వెలిశాయి. వాటితో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పాఠశాలకు చెందిన ఉన్నతాధికారులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వాటిని తొలగించాలని కలెక్టర్‌ రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. కలెక్టర్‌ ఆదేశాల మేరకు అక్కడ నివసిస్తున్న వారు వెంటనే ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని స్థానిక రెవెన్యూ అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. వారు స్వచ్ఛందగా ఖాళీ చేయకపోతే బలవంతంగానైనా ఖాళీ చేయించాలనే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. అలాగే మంగళవారం పంచాయతీ, మున్సిపాలిటీ అధికారులతో జరిగిన ప్రత్యేక సమావేశంలోనూ జిల్లా కేంద్రంలోని అక్రమ టేలాల ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలో రహదారుల విస్తరణ జరిగితే ట్రాఫిక్‌ ఇక్కట్లు తొలుగుతాయని అధికా రులు అభిప్రాయపడినట్లు సమాచారం.

దర్జాగా కబ్జా!? 1
1/1

దర్జాగా కబ్జా!?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement