
రైతుల తిప్పలు.. వరదలో బస్తాలు
రెబ్బెన(ఆసిఫాబాద్): జిల్లాలోని రైతులకు ఎరువుల కోసం తిప్పలు తప్పడంలేదు. వానాకాలం పంటలకు కావాల్సిన యూరియా దొరకడం లేదు. ప్రైవేటు ఫర్టిలైజర్ షాపుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కాకుండా.. అధిక రేట్లకు విక్రయిస్తుండటంతో అన్నదాతలపై ఆర్థికభారం పడుతోంది. రెబ్బెన మండల కేంద్రంలోని పీఏసీఎస్‌కు మంగళవారం ఓ లారీ లోడ్ యూరియా వచ్చింది. బుధవారం మరో లారీ లోడ్ రావడంతో వ్యవసాయశాఖ అధికారులు పంపిణీ ప్రారంభించారు. వందలాది మంది తరలిరావడంతో ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేసేందుకు టోకెన్లు జారీ చేశారు. కొంతమందికి అధికారులు దొడ్డిదారిలో ఎక్కువ బస్తాలు ఇవ్వడంతో రైతులు ఆగ్రహించారు. రెబ్బెన ఎస్సై చంద్రశేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని వారితో మాట్లాడి సముదాయించారు.
తడిసిన బస్తాలు..
బుధవారం వచ్చిన లారీ గోడౌన్ వరకు వెళ్లే అవకాశం లేకపోవడంతో రోడ్డుపైనే నిలిపి అన్‌లోడ్ చేశారు. వర్షం కురవడంతో బస్తాలపై సిబ్బంది కవర్ కప్పించారు. అయితే రోడ్డు వెంబడి వచ్చిన వరద నీటితో బస్తాలు తడిసిపోయాయి. కనీసం వాటిని అక్కడ నుంచి తీసి పక్కన పెట్టకుండా నిర్లక్ష్యంగా వహించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి తడిసిన బస్తాలనే వారికి అంటగట్టారు. ఓ జిల్లాలో యూరియా దొరకక ఇబ్బందులు పడుతుండగా, రెబ్బెన మండలంలో బస్తాలను వరద ప్రవాహంలో తడుస్తున్నా పట్టించుకోకుండా వదిలేయడంపై విమర్శలు వస్తున్నాయి.

రైతుల తిప్పలు.. వరదలో బస్తాలు