
‘తార’ సేవలు భేష్
● ఎస్పీ అఖిల్ మహాజన్ ● ఘనంగా పోలీసు జాగిలం అంత్యక్రియలు
ఆదిలాబాద్‌టౌన్: పోలీసు శాఖకు జాగిలం తార అందించిన సేవలు మరువలేనివని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. 2013 బ్యాచ్‌లో పోలీసు వ్యవస్థలోకి వచ్చిన తార జిల్లాలో పేలుడు పదార్థాలను కనుగొనడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. పోలీసు జాగిలం తార మృతిచెందడంతో గురువారం పోలీసు కార్యాలయంలో అంత్యక్రియలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ పాల్గొని తారకు శాలువా, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ వీఐపీలు జిల్లాపర్యటనకు వచ్చిన సందర్భంగా భద్రత విషయంలో తనిఖీలు నిర్వహించడంలో తార సేవలు ఎంతగానో దోహద పడ్డాయని గుర్తు చేశారు. పోలీసు జాగిలాలకు సకల సదుపాయాలు కల్పించాలని, ఎండ తీవ్రత దృష్ట్యా ప్రతీ జాగిలానికి కూలర్ ఏర్పాటు చేయాలని సూచించారు. రిజర్వు ఇన్స్పెక్టర్ వెంకటి, మురళి, డాగ్‌స్క్వాడ్ సిబ్బంది రమేశ్, తిరుమలేశ్ తదితరులు పాల్గొన్నారు.