‘ఇంటి దొంగల్లో’ టెన్షన్!
మరో చుక్కల దుప్పి మృతి..
ఖమ్మం టాస్క్‌ఫోర్స్ అదుపులో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ?
అతడు నోరు విప్పితే వివరాలు వెలుగులోకి..
ఏం చెబుతాడోనని కొందరు సిబ్బందిలో ఆందోళన
సత్తుపల్లి: సత్తుపల్లి అర్బన్ పార్కులో దుప్పుల వేటపై ఒక్కో విషయం వెలుగులోకి వస్తోంది. ఇంటి దొంగలను పట్టుకునేందుకు అటవీశాఖ టాస్క్‌ఫోర్స్ అధికారులు ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని అదుపులోకి తీసుకుని ఖమ్మంలో గోప్యంగా విచారణ చేస్తున్నారు. దుప్పుల వేటలో ఎంత మంది ప్రమేయం ఉంది.. ఎంత కాలం నుంచి జరుగుతోంది అనే వివరాలు రాబట్టే పనిలో ఉన్నతాధికారులు ఉన్నారు. విచారణలో ఇంటిదొంగ నోరువిప్పితే ఎవరెవరి పేర్లు వెల్లడవుతాయోనని వేటగాళ్లతో పాటు వారికి సహకరించిన సిబ్బందిలో ఆందోళన నెలకొంది. అర్బన్ పార్కులో అధికారులు విచారణ చేస్తున్న సమయంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ప్రశ్నించాలని నిర్ణయం తీసుకోగానే ఒకరు ఫోన్ స్విచాఫ్ చేసి తప్పించుకోగా, అటవీ శాఖ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి శనివారం రాత్రి ఓ మద్యం షాపులో అదుపులోకి తీసుకుని ఖమ్మం తరలించినట్లు సమాచారం.
పార్కులో రక్షణ లేదా..?
సత్తుపల్లి అర్బన్‌పార్కులో వన్యప్రాణులకు రక్షణ లేదంటూ జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. చుక్కల దుప్పులను వేటగాళ్లు మాటు వేసి చంపడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఎంతో మందికి ఆహ్లాదాన్ని పంచే అర్బన్ పార్కులో జంతువేటపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇటీవల ఈ పార్కులో రూ.30 లక్షలతో 125 ఎకరాల్లో అంతర్గతంగా చైన్ లింక్ ఫెన్సింగ్ వేశారు. అలాగే సింగరేణి పరిధిలో ఉన్న అటవీ ప్రాంతానికి కూడా చైన్ లింక్ కంచె ఏర్పాటు చేశారు. అయినా దుప్పుల వేట, ప్రమాదాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి.
‘అదనపు’ పని భారంతోనే..!
సత్తుపల్లి అర్బన్ పార్కు నిర్వహణకు అటవీ శాఖ పూర్తి స్థాయిలో రెగ్యులర్ ఉద్యోగులను నియమించకుండా ఇతర ఉద్యోగులకు అదనపు బాధ్యతలు అప్పగించింది. దీంతో వారు పూర్తి స్థాయిలో విధులు నిర్వహించలేకపోతున్నారని సమాచారం. ఈ పార్కులో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లతో పాటు ఐదుగురు ఔట్ సోర్సింగ్ సిబ్బంది పని చేస్తున్నారు. రోజుకు పదుల సంఖ్యలో సందర్శకులు వస్తుండగా నెలకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం సమకూరుతోంది.
సమాచార సేకరణలో నిఘా వర్గాలు..
అర్బన్ పార్కులో దుప్పిని తుపాకితో వేటాడారనే ఆరోపణల నేపథ్యంలో పోలీస్ నిఘా వర్గాలు సమాచారం సేకరించే పనిలో పడ్డాయి. అటవీశాఖ అధికారులు సైతం పోలీసుల సహకారంతో ఈ కేసును ఓ కొలిక్కి తెచ్చేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఉన్నట్లు తెలిసింది. వేటగాళ్లను పట్టుకునేందుకు ఉమ్మడి జిల్లాల్లో తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉన్నందున, పోలీసుల ప్రమేయం ఉంటే వేగంగా దర్యాప్తు చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లు సమాచారం.
అర్బన్ పార్కులో దుప్పుల వేటపై అటవీ శాఖ అధికారులు మూడురోజులుగా అక్కడే మకాం పెట్టి విచారణ చేస్తుండగా.. ఆదివారం ఉదయం కాలు విరిగి మృత్యువాత పడిన చుక్కల దుప్పిని వాకర్స్ గుర్తించారు. వారు సోషల్ మీడియాలో ఈ విషయం పోస్ట్ చేయడంతో కలకలం రేగింది. అటవీ శాఖ నిర్లక్ష్యంపై పోస్టింగ్‌లు వెల్లువెత్తాయి. అటవీ అధికారులు మాత్రం వేగంగా పరిగెత్తుకుంటూ వస్తుండగా వెదురు బొంగు కాలుకు గుచ్చుకుందని, ఈ పెనుగులాటలో దుప్పి మృత్యువాత పడిందని తెలిపారు. ఈ మేరకు పశువైద్యాధికారి శశిదీప్ పోస్టుమార్టం నిర్వహించాక దహనం చేసినట్లు వెల్లడించారు.
‘ఇంటి దొంగల్లో’ టెన్షన్!


