● రూ.7,178 కోట్ల వంచన, రూ.1,009 కోట్ల జప్తు ● నిత్యం సగటున 770కు పైగా కేసుల నమోదు | - | Sakshi
Sakshi News home page

● రూ.7,178 కోట్ల వంచన, రూ.1,009 కోట్ల జప్తు ● నిత్యం సగటున 770కు పైగా కేసుల నమోదు

Jun 20 2026 11:19 AM | Updated on Jun 20 2026 11:19 AM

సమాచార సాంకేతిక రంగంలో

ముందంజలో ఉన్న కర్ణాటక సైబర్‌

వంచకులకు టార్గెట్‌గా నిలిచింది. సైబర్‌ నేరాల్లో కర్ణాటక రెండో స్థానంలో ఉంది.

బనశంకరి: గత 6 ఏళ్ల నాలుగు నెలల్లో కర్ణాటకలో రూ.7,178.62 కోట్లు సైబర్‌ వంచకుల పాలయ్యాయి. ఇందులో రూ.1,009 కోట్లను జప్తు చేయడంలో పోలీసులు సఫలీకృతులయ్యారు. 2020 నుంచి 2026 ఏప్రిల్‌ చివరి వరకు రాష్ట్రంలో మొత్తం 6.89 లక్షల కేసులు నమోదయ్యాయి. కానీ దర్యాప్తు సంస్థల చర్యలతో ఫ్రీజ్‌ చేసింది మాత్రం రూ.1,009 కోట్లు మాత్రమే.

గత నాలుగు నెలల్లో రూ.791 కోట్ల వంచన

2026 జనవరి నుంచి ఏప్రిల్‌ 30 వరకు 93,438 కేసులు నమోదు కాగా ప్రజల నుంచి రూ.791 కోట్లు దోచేశారు. సగటున రోజుకు 770కు పైగా కేసులు నమోదు కావడం సైబర్‌ నేరాల తీవ్రతను తెలియజేస్తోంది. గతంలో బ్యాంక్‌ కాల్స్‌, ఓటీపీ వంచనకు పరిమితమైన నేరాలు ప్రస్తుతం విభిన్న కోణాల్లో సంతరించుకున్నాయి. ఫేక్‌ పెట్టుబడి యాప్‌లు, డిజిటల్‌ అరెస్ట్‌ల బెదిరింపు, పార్శిల్‌ స్క్యామ్‌, ఈ–కేవైసీ రెన్యువల్‌ లింక్‌, సోషల్‌ మీడియాలో స్నేహం పెంచుకుని వంచన, ఉద్యోగం, లాభదాయక పెట్టుబడి ప్రలోభం, క్రిప్టో కరెన్సీ వంచన లాంటి కొత్త తరహా వంచనల ద్వారా ప్రజలను వంచనకు పాల్పడుతున్నారు.

బెంగళూరులో అధిక మోసాలు

బెంగళూరులో ఐటీ ఉద్యోగులు, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ వినియోగదారులు, డిజిటల్‌ వ్యవహారాలు పెరగడంతో సైబర్‌ వంచకుల దృష్టి పడింది. త్వరితగతిన ఆన్‌లైన్‌ వ్యవహారాలు, యూపీఐ వినియోగం, మొబైల్‌ ఆధారిత బ్యాంకింగ్‌ కార్యకలాపాలు పెరగడం సైబర్‌ నేరగాళ్లకు అవకాశం కల్పిస్తోంది. వంచనకు పాల్పడిన కొద్ది నిమిషాల్లో నగదు వేరే అకౌంట్లకు జమ చేస్తున్నారు. కొన్ని కేసుల్లో క్రిప్టో కరెన్సీ, విదేశీ బ్యాంక్‌ అకౌంట్లను వినియోగిస్తుండటంతో దర్యాప్తు మరింత క్లిష్టంగా మారింది. ఫిర్యాదు చేయడం ఆలస్యమైతే నగదు ఫ్రీజ్‌ చేసే అవకాశం చాలా తక్కువ.

కర్ణాటకకు ద్వితీయ స్థానం..

2023 నుంచి కర్ణాటక సైబర్‌ నేరాల్లో వరుసగా మూడో స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2024లో 1,65,830 కేసులు నమోదు కాగా 2025లో 2,52,015 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కర్ణాటక సైబర్‌ నేరాల్లో ద్వితీయ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో మహారాష్ట్ర నిలిచింది. డబ్బు కోల్పోయిన వారి సమాచారం ఎన్‌సీఆర్‌పీ పోర్టల్‌లో నమోదైన ఫిర్యాదుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని, గోల్డెన్‌ అవర్‌లో ఫిర్యాదు చేస్తే డబ్బు తక్షణం ఫ్రీజ్‌ చేసి చర్యలు చేపడతామని సైబర్‌ కమాండ్‌ డీఐజీపీ ఆనంద్‌కుమార్‌ తెలిపారు.

పోలీసులు ఎదుర్కొంటున్న సవాళ్లు

రాష్ట్రంలో సైబర్‌ కమాండ్‌ సెంటర్‌, సైబర్‌ క్రైం పోలీస్‌స్టేషన్లు, సీసీబీ ఉన్నప్పటికీ సైబర్‌ నేరాల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిపుణుల కొరత, సాంకేతిక సవాళ్లు, అంతర్జాతీయ ముఠా సంబంధాలు దర్యాప్తునకు అడ్డంకిగా మారాయి. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించే ప్రజల కంటే వంచకుల కొత్త విధానాలు చట్టాలు అమలు చేసే సంస్థలకు సవాల్‌గా మారాయి. ప్రభుత్వం, బ్యాంకులు, ప్రజలు జాగృతంగా వ్యవహరించినప్పుడు మాత్రమే సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement