బళ్లారి అర్బన్: బెంగళూరు వద్ద బిడది ఆరోహళ్లి ఓబ్లిలో సారవంతమైన వ్యవసాయ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం సరికాదని జేడీఎస్ జిల్లా అధ్యక్షుడు మీనాళ్లి తాయణ్ణ తెలిపారు. జేడీఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి గడిగి చెన్నప్ప సర్కిల్ మీదుగా జిల్లా అధికారి కార్యాలయానికి చేరుకుని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు మీనాళ్లి తాయణ్ణ మాట్లాడుతూ.. మొదటి దశలో సుమారు 500 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడం వల్ల 755 రైతు కుటుంబాలు వీధిన పడ్డాయన్నారు. ఇందులో ఒక ఎకరా కన్న తక్కువ భూమి ఉన్న రైతులే అధికంగా ఉన్నారని తెలిపారు. ఇక రానున్న దశలో భారీగా భూమిని స్వాధీనం చేసుకునే ఆలోచనను రద్దు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం స్మార్ట్ సిటీ ఇంటర్ గ్రేడింట్ టౌన్ షిప్ పేరుతో రియల్ ఎస్టేట్ చేస్తోందన్నారు. దీంతో వేలాది కోట్ల రూపాయల విలువ గల భూమిని రైతులు కోల్పోతున్నారని తెలిపారు. అంతేగాక 10 లక్షలకు పైగా చెట్లు నేలమట్టం అవుతాయన్నారు. సమావేశంలో పార్టీ నేతలు యల్లన్నగౌడ, లక్ష్మీకాంత్‌రెడ్డి, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


