పరిషత్‌ ఎన్నికల్లో హస్తం హవా | - | Sakshi
Sakshi News home page

పరిషత్‌ ఎన్నికల్లో హస్తం హవా

Jun 19 2026 12:36 AM | Updated on Jun 19 2026 12:36 AM

బనశంకరి: విధానసభ నుంచి విధాన పరిషత్‌లో 7 స్థానాలకు నిర్వహించిన ఎన్నికలలో అధికార కాంగ్రెస్‌ పార్టీ విజయదుందుభి మోగించింది. ఓ సీటును అదనంగా గెల్చుకుంది. అందరూ ఊహించినట్లే కాంగ్రెస్‌ నుంచి ఐదుమంది, బీజేపీ నుంచి ఇద్దరు కూడా ఎన్నికయ్యారు.

విజేతలు వీరే

కాంగ్రెస్‌ అభ్యర్థులు బీకే.హరిప్రసాద్‌, తిప్పణ్ణప్ప కమకనూరు, పీవీ.మోహన్‌, శివణ్ణ బీఎస్‌, వినయ్‌ కార్తీక్‌ గెలుపొందారు.

● బీజేపీ నుంచి రఘు కౌటిల్య, లింగరాజ పాటిల్‌ ఎన్నిక కాగా, జేడీఎస్‌ అభ్యర్థి గోవిందరాజు ఓడిపోయారు.

ప్రతిపక్ష ఓట్లకు గండి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్‌ను క్రాస్‌ ఓటింగ్‌ వెంటాడింది. బీజేపీ నుంచి ముగ్గురు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడగా, జేడీఎస్‌ నుంచి ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఓటేసినట్లు వెల్లడైంది. దీనివల్లే కాంగ్రెస్‌ ఐదో అభ్యర్థి వినయ్‌ కార్తీక్‌ 32 ఓట్లతో ఎన్నికయ్యారు.

ఇద్దరు అభ్యర్థులకు తలా 30 ఓట్లు వేయాలని తమ ఎమ్మెల్యేలకు బీజేపీ పెద్దలు సూచించారు. కానీ రఘు కౌటిల్య కు 29 ఓట్లు పడగా, ఒక ఓటు చెల్లలేదు. లింగరాజ్‌ పాటిల్‌కు 27 తొలి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి, 3 ఓట్లు క్రాస్‌ అయ్యాయి.

రిసార్టుల నుంచి అసెంబ్లీకి

శివాజీనగర: ముందునుంచీ 7వ అభ్యర్థి గెలుపు ఎవరిదని కుతూహలం ఏర్పడింది. ఆ స్థానం కోసం కాంగ్రెస్‌ వినయ్‌ కార్తీక్‌, బీజేపీ మద్దతుతో జేడీఎస్‌ అభ్యర్థి గోవిందరాజు మధ్య పోటీ నెలకొంది. మూడు పక్షాలూ తమ ఓట్ల ఐక్యతను కాపాడుకునే ప్రయత్నం చేశాయి. ఇందుకోసం కాంగ్రెస్‌, జేడీఎస్‌లు తమ ఎమ్మెల్యేలను రిసార్ట్‌కు తీసుకెళ్లాయి. అక్కడి నుంచి గురువారం ఉదయం విధానసౌధకు చేరుకుని ఓటేశారు. ఉదయం 9 గంటలకు పోలింగ్‌ మొదలైంది. తొలి అంతస్తులో ఉన్న 106వ గది పోలింగ్‌ కేంద్రమైంది. పార్టీ పక్ష నేతలు ముందే ఏ ఎమ్మెల్యే ఏ అభ్యర్థికి ఓటేయాలనేది నిర్దేశించారు. ముందుజాగ్రత్తగా ఓటింగ్‌ ముగిసేవరకూ పరిశీలిస్తూ ఉన్నారు.

సీఎం, సీనియర్ల సమీక్ష

విధానసౌధ 3వ అంతస్తుఽలోని సభామందిరంలో సీఎం డీ.కే.శివకుమార్‌, ఏఐసీసీ కార్యదర్శి రణదీప్‌సింగ్‌ సుర్జేవాలా, కేపీసీసీ అధ్యక్షుడు బీ.కే.హరిప్రసాద్‌, మాజీ సీఎం సిద్దరామయ్య తమ ఎమ్మెల్యేలకు మార్గదర్శనం చేశారు. బీజేపీ నుంచి సస్పెండ్‌ అయిన ఎమ్మెల్యేలు ఎస్‌.టీ.సోమశేఖర్‌ మాట్లాడుతూ సీఎం బుధవారం పిలిచి, తమకు ఓటేయాలని కోరినట్లు తెలిపారు. తమ నియోజకవర్గ సమస్యలకు స్పందించేవారికి ఓటు వేశానన్నారు. శివరామ్‌ హెబ్బార్‌ మాట్లాడుతూ తనను కాంగ్రెస్‌వారు మాత్రమే మద్దతు కోరారు, ఇంకెవరూ సంప్రదించలేదన్నారు.

ఎవరెవరు ఓటేశారు..

కాంగ్రెస్‌ నుంచి 135 మంది ఎమ్మెల్యేలు, బీజేపీ నుంచి 62 మంది, జేడీఎస్‌ నుంచి 18, బీజేపీ నుంచి సస్పెండ్‌ అయిన ముగ్గురు, సర్వోదయ కర్ణాటక పార్టీ ఎమ్మెల్యే దర్శన్‌ పుట్టణ్ణయ్య, కర్ణాటక రైతు ప్రగతి పార్టీ గాలి జనార్ధనరెడ్డి, స్వతంత్రులు గౌరిబిదనూరు పుట్టస్వామి, హరపనహళ్ళి లతా మల్లికార్జున ఓటు హక్కు వినియోగించుకున్నారు. హోం మంత్రి పరమేశ్వర్‌ అనారోగ్యంతో ఉన్నప్పటికీ వచ్చి ఓటేశారు.

యత్నాల్‌ వివాదం, ఊరట

శివాజీనగర: పరిషత్‌ ఎన్నికలతో విధానసౌధలో కోలాహలం నెలకొంది. 220 మందికిపైగా ఎమ్మెల్యేలు ఓటు వేశారు. పోలింగ్‌ ప్రక్రియ మధ్యలో పార్టీల నేతలు ఆరోపణలు, ఫిర్యాదులు చేసుకున్నారు. బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌ బీజేపీకే మద్దతుగా నిలిచారు. బీజేపీకి ఓటు వేస్తానని లేఖ విడుదల చేశారు. ఇది సరికాదంటూ ఆయనపై కాంగ్రెస్‌ నాయకులు, తక్షణమే ఎన్నికల అధికారి విశాలాక్షికి ఫిర్యాదు చేశారు. ఇది నియమాల ఉల్లంఘన అని, యత్నాళ్‌ ఓటును రద్దు చేయాలని కోరారు. కానీ యత్నాల్‌ బూత్‌లో రహస్యంగా ఓటు వేశారని, ఇందులో నియమ ఉల్లంఘన జరగలేదని కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదును విశాలాక్షి తిరస్కరించడంతో వివాదం ముగిసింది.

ఇక బీజేపీ నుంచి సస్పెండైన ఎస్‌.టీ.సోమశేఖర్‌, శివరామ హెబ్బార్‌, జేడీఎస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే జీ.టీ.దేవేగౌడ ఆత్మసాక్షికి బద్ధులమంటూ, కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఓటు వేశారు. మరికొందరు రహస్యంగా క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారు.

నాలుగే కాదు, 5వ సీటూ కాంగ్రెస్‌ పరం

బీజేపీకి దక్కిన 2 సీట్లు

జేడీఎస్‌ అభ్యర్థి పరాజయం

ప్రతిపక్షాల నుంచి 7 మంది ఎమ్మెల్యేల క్రాస్‌ ఓటింగ్‌

విధానసౌధలో పోలింగ్‌ కోలాహలం

జిమ్మిక్కులు చేయలేదు: సీఎం

దొడ్డబళ్లాపురం: విధానపరిషత్‌ ఎన్నికలు ముగిశాయి, తాము ఎలాంటి జిమ్మిక్‌లకు పాల్పడలేదని సీఎం డీకే శివకుమార్‌ చెప్పారు. పరిషత్‌ ఎన్నికల్లో ఓటు వేశాక ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలు ఎవరూ ఒత్తిడికి గురికాలేదని, ఇష్టానుగుణంగానే ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. ఎమ్మెల్యేలను రిసార్ట్‌లో ఉంచడం ద్వారా రిసార్ట్‌ రాజకీయాలకు పాల్పడ్డారా అని ప్రశ్నించగా, అది రిసార్ట్‌ రాజకీయం కాదని, ఎమ్మెల్యేలపై నమ్మకం లేక కాదని, ఎన్నికల ప్రక్రియపై శిక్షణ కోసమని వివరించారు. క్రాస్‌ ఓటింగ్‌ అంటే తనకు తెలియదని, అలా చేయించాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. అసెంబ్లీలో ఉన్న 224 మంది ఎమ్మెల్యేలూ తనకు కావాల్సిన వారేనని, తాను అందరికీ ముఖ్యమంత్రినని అన్నారు.

మన ఓట్లు మనకే.. బీజేపీ వ్యూహం

శివాజీనగర: తమ ఎమ్మెల్యే ఒకరు క్రాస్‌ ఓటింగ్‌ చేసిఉండవచ్చనే అనుమానంతో బీజేపీ మధ్యలోనే వ్యూహాన్ని మార్చింది. తన అభ్యర్థులకు ఒకరికి 29 ఓట్లు చొప్పున వేయాలని ఎమ్మెల్యేలకు నిర్దేశించింది. మిగిలే ఓట్లను జేడీఎస్‌ అభ్యర్థికి వేయాలని తెలిపింది. అయితే పోలింగ్‌ ఆరంభం కాగానే జేడీఎస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే బీజేపీకి ఓటేసినట్లు తేటతెల్లమైంది. నియమాల ప్రకారం ఇది రహస్య ఓటింగ్‌ కావడంతో ఏ ఎమ్మెల్యే ఏ అభ్యర్థికి ఓటు వేశారనేది తెలుసుకోవడానికి సాధ్యపడదు. అయితే ఎమ్మెల్యేల ప్రవర్తన క్లూ ఇస్తుంది. ఒక ఓటు పోయిందని ప్రచారం జరగ్గానే బీజేపీ నాయకులు.. జేడీఎస్‌ సంగతిని పక్కన పెట్టేశారు. మొత్తం ఓట్లు మన అభ్యర్థులకే వేయాలని ఆదేశించారు. బీజేపీ పక్ష నేత ఆర్‌.అశోక్‌, రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర తమ చాంబర్లలో ఎమ్మెల్యేలతో చర్చించి ఒక్కో అభ్యర్థికి 30 ఓట్లు పడాలని సూచించారు. దీని వల్ల మిత్రపక్షం జేడీఎస్‌కు ఓట్లు తగ్గాయి.

గత వారం రోజులుగా తీవ్ర ఉత్కంఠగా సాగిన పరిషత్‌ ఎన్నికల వ్యూహ ప్రతి వ్యూహాల్లో అధికార పార్టీదే పైచేయి అయ్యింది. హోరాహోరీ పోరాటంలో ప్రతిపక్షాలను వెనక్కు నెట్టి 5వ సీటును కూడా గెల్చుకుంది. క్రాస్‌ ఓటింగ్‌ వల్ల జేడీఎస్‌కు నిరాశే మిగిలింది. తాము నష్టపోతామనే భయంతో బీజేపీ మిగులు ఓట్లను జేడీఎస్‌కు కేటాయించలేకపోయింది.

కాంగ్రెస్‌ అభ్యర్థుల ఓట్లు

బీకే.హరిప్రసాద్‌ – 30 ఓట్లు

పీవీ.మోహన్‌ – 29

బీఎస్‌.శివణ్ణ – 30

తిప్పణ్ణప్ప కమకనూర– 30

ఐదో అభ్యర్థి వినయ్‌ కార్తీక్‌ – 32

బీజేపీ అభ్యర్థులకు

రఘు కౌటిల్య – 29 ఓట్లు

లింగరాజు పాటిల్‌ – 27

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement