పిల్లలపై కూలిన కాంపౌండ్‌ | - | Sakshi
Sakshi News home page

పిల్లలపై కూలిన కాంపౌండ్‌

Jun 19 2026 12:36 AM | Updated on Jun 19 2026 12:36 AM

ఒకరు మృత్యువాత

దొడ్డబళ్లాపురం: ఆడుకుంటున్న పిల్లల మీద కాంపౌండ్‌ గోడ కూలి ఒకరు మరణించిన సంఘటన బెంగళూరులోని బాగలూరులో జరిగింది. బండికొడిగేహళ్లిలో బుధవారం సాయంత్రం ముగ్గురు పిల్లలు ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా హఠాత్తుగా ఓ ఇంటి కాంపౌండ్‌ గోడ హఠాత్తుగా కూలి పిల్లల మీద పడింది. ఆసిఫ్‌ (5) అనే బాలునిపై పెద్ద పెద్ద శిథిలాలు పడడంతో అక్కడే చనిపోయాడు. సమన్వి అనే బాలిక గాయపడగా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

మేడ మీద నుంచి పడి...

బంధువుల ఇంట్లో ఆడుకుంటూ మేడ మీద నుంచి కిందపడి బాలుడు మృతి చెందాడు. నెలమంగల తాలూకా తోటగుడ్డదహళ్లిలో మొదటి అంతస్తులో ఆడుకుంటున్న దీక్షిత్‌ (2) అనే బాలుడు ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. తల్లిదండ్రులు అతన్ని ఆస్పత్రికి తరలించగా 24 గంటలపాటు కోమాలో ఉండి గురువారం కన్నుమూశాడు. దాసరహళ్లికి చెందిపన నవీన్‌ కుమార్‌, కావ్య దంపతులు కుమారుడు దీక్షిత్‌తో కలిసి బంధువుల ఇంటికి రాగా ఈ దుర్ఘటన జరిగింది.

27 రోజుల్లో

రూ.2.73 కోట్ల కానుకలు

మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని ప్రసిద్ధ మలే మహదేశ్వర బెట్ట మాదప్ప దేవస్థానం హుండీలో కోట్లాది రూపాయల కానుకలు వచ్చాయి. బుధవారం హుండీలను లెక్కించారు. ఈ నెలలో ఎక్కువ సెలవులు, అమావాస్య నేపథ్యంలో భక్తుల తాకిడి పెరిగింది. 27 రోజుల్లో రూ. 2.73 కోట్ల నగదు భక్తుల నుంచి కానుకల రూపంలో వచ్చింది. 44 గ్రాముల బంగారం, 977 గ్రాముల వెండి సొత్తు లభ్యమైంది. పలు దేశాల కరెన్సీతో పాటు నిషేధిత రూ. 2 వేల నోట్లు కూడా లభించాయి. భక్తులు సగటున రోజుకు రూ.10 లక్షల డబ్బును హుండీలలో వేశారు.

భార్యను హత్య చేసి..

ఆత్మహత్య నాటకం

కోలారు తాలూకాలో ఘోరం

కోలారు: పుట్టింటి నుంచి మరింత డబ్బు, బంగారం తేవాలని భర్త భార్యను వేధిస్తూ, కుక్కర్‌తో కొట్టి చంపి ఆపై ఉరివేసుకున్నట్లు చూపించిన ఘటన తాలూకాలోని దొడ్డహసాళ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన సహన (24) కట్న దాహానికి బలైన వివాహిత యువతి. వివరాలు.. భర్త మంజునాథ్‌తో పొరుగూరికి చెందిన సహనకు ఆరేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరింత కట్నం తీసుకు రావాలని భర్త ఆమెను సతాయించేవాడు. గురువారం కూడా ఇదే విషయమై ఘర్షణకు దిగాడు, కుక్కర్‌తో తలపై గట్టిగా కొటి స్పృహ కోల్పోయిన తరువాత బెడ్‌రూంలో ఫ్యాన్‌కు ఉరి వేసి, ఆత్మహత్య చేసుకుందని ప్రచారం చేశాడు. ఇది తెలిసిన సహన తల్లిదండ్రులు హుటాహుటిన దొడ్డహసాళ గ్రామానికి చేరుకుని బోరున విలపించారు. ఉరివేసుకున్న దృశ్యాన్ని చూస్తే ఇది ఆత్మహత్య అని ఎవరూ నమ్మరని తెలిపారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న కోలారు రూరల్‌ పోలీసులు భర్త మంజునాథ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

వలస కూలీపై ఏనుగు దాడి

కెలమంగలం: వలస కూలీ మహిళపై ఏనుగు దాడి చేయడంతో ఆమె కాలు విరిగిన ఘటన డెంకణీకోట సమీపంలో గురువారం ఉదయం చోటు చేసుకొంది. వివరాల మేరకు డెంకణీకోట సమీపంలోని ఆలహళ్లి వద్ద గులాబీ తోటలో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన కూలీ కుటుంబం పనిచేస్తోంది. మహిళా కూలీ రీమా (30) ఇంటి నుంచి బయటకెళ్లే సరికి పొదల్లో దాగి ఉన్న ఏనుగు ఆమైపె తొండంతో దాడి చేసింది. రీమా హాహాకారాలు చేయడంతో స్థానికులు వచ్చి ఏనుగును తరిమివేసి ఆమెను డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు కాలు విరిగి, గాయాలు తగిలాయి. అటవీశాఖాధికార్లు ఘటనా స్థలిని పరిశీలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement