హుబ్లీ: జంట నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. చెత్త నిర్వహణ పాలికెకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా కూడా బహిరంగ స్థలాల్లో చెత్త పారవేయడం ఆగడం లేదు. దీంతో చెత్త వేసే వారికి బుద్ధి చెప్పడానికి పాలికె అధికారులు ముందుకు వచ్చారు. ఎవరు చెత్త పారవేస్తారో వారి ఇంటి ముందే చెత్తను పారవేసే పథకానికి శ్రీకారం చుట్టారు. ఇటీవలే ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా ధార్వాడలో నలుగురు నివాసుల ఇళ్ల ఎదుట చెత్తను పారవేసి బుద్ధి చెప్పారు. అంతేగాక వారి నుంచి రూ.16 వేల జరిమానా చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. హుబ్లీలో కూడా చెత్త పారవేసే వారిపై క్షుణ్ణంగా పహారా కాస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి వారి ఇంటి ఎదుటే చెత్త పారబోసి జరిమానా కూడా విధిస్తున్నారు.
మొబైల్‌లో ఫొటో తీసి హెల్త్ ఇన్‌స్పెక్టర్‌కు షేర్
మొబైల్‌లో ఫోటో తీసి హెల్త్ ఇన్‌స్పెక్టర్‌కు పంపిస్తారు. ఈ సందర్భంగా చెత్తలో నివాసుల పేరున కాగితాలు, బిల్లులు కనిపిస్తాయి. వాటి ఆధారంగానే అడ్రస్‌ను కనుగొని వారి ఇంటి ఎదుటనే చెత్తను పారవేస్తున్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో అమర్చిన సీసీ కెమెరాలను పరిశీలించి బాధ్యులను గుర్తించి జరిమానా విధిస్తున్నట్లు చెత్త నిర్వహణ విభాగం ఈఈ సంతోష్ యరంగళి తెలిపారు. స్థానికుల్లో జాగృతి కోసం ప్రయత్నిస్తున్నాము. తడి, పొడి చెత్త విభజనపై చైతన్యం కల్పిస్తున్నాం. చెత్తను వేరు పరచకపోతే అలాంటి వారిపై కూడా జరిమానా విధించడం, చెత్తను వారి ఇంటి ముందు పారవేసే ప్రక్రియ ప్రారంభించామన్నారు. రెండు సార్లు జరిమానా విధించి మూడో సారి బాధ్యుల వాహనాలు సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు.
తొలిదశలో రూ.5 వేల జరిమానా విధింపు
కుసుగల్ రోడ్డు, గదగ్ రోడ్డు, కార్వాడ రోడ్డు, కెళగేరి రోడ్లలో చెత్త రోడ్డుపై పారవేసే దృశ్యాలు కనిపిస్తున్నాయి. అలాంటి వారికి ముఖ్యంగా ఇంటి నిర్మాణ వ్యర్థాలను రోడ్డుపై పారవేసే వారికి తొలిదశలో రూ.5 వేలు, రెండో సారి రూ.10 వేలు జరిమానా విధిస్తాం. మూడో సారి మాత్రం వాహనాన్ని సీజ్ చేయడమే కాకుండా అలాంటి వారిపై కేసు కూడా నమోదు చేస్తామని సమగ్ర వివరాలను ఆయన ఏకరువు పెట్టారు. నాలుగు కేసుల్లో రూ.13 వేలు జరిమానా వసూలు చేశారు. 114 సీసీ టీవీ కెమెరాలు చెత్త పారవేసే వారిని డేగ కళ్లతో పసిగడుతున్నాయన్నారు. అంతేగాక హెల్త్ ఇన్‌స్పెక్టర్లు, పర్యావరణ శాఖ ఇంజనీర్లు, సూపర్‌వైజర్లు, కమ్యూనిటీ మొబిలైజర్లు వార్డుల్లో తిరుగుతూ ఉంటారని, చెత్త పారవేసే వారు కనిపించగానే జరిమానా విధిస్తారన్నారు.
బహిరంగ స్థలాల్లో ఆగని చెత్త పారవేత
పాలికెకు తలనొప్పిగా మారిన నిర్వహణ


