మైసూరు: నాడహబ్బ మైసూరు దసరా వేడుకలు సాంస్కృతికంగా, మతానికి అతీతంగా జరుగుతాయని, ఆ ఉత్సవాలను ఫలానా వ్యక్తే ప్రారంభించాలి అన్న నిబంధనలు ఏమీ లేవని సీఎం సిద్దరామయ్య అన్నారు. ఆదివారం మైసూరు నగరంలోని మండకళ్ళి విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మైసూరు దసరా సాంస్కృతిక పండుగ, ఇది జాతి, ధర్మాలకు అతీతంగా చేసే పర్వదినం. అన్ని రకాల జాతులవారు, మతాల వారు నిర్వహిస్తారు. గతంలో ముస్లిం మతానికి చెందిన కవి నిసార్ అహ్మద్ మైసూరు దసరా వేడుకలను ప్రారంభించారు. గతంలో టిప్పు, హైదరలి కూడా శ్రీరంగపట్టణంలో ఘనంగా దసరా నిర్వహించారు. దివాన్ మీర్జా ఇస్మాయిల్ కూడా దసరా జరిపించారు. అందువల్ల దసరాకు మతాన్ని అంటగట్టడం సరికాదు అని చెప్పారు. ఇలాంటి సమయంలో మతాల గురించి మాట్లాడవద్దని పరోక్షంగా బీజేపీ, జేడీఎస్‌లకు సూచించారు.
బాను ముష్తాక్‌కు మద్దతు
ప్రముఖ కవయిత్రి బాను ముష్తాక్‌చే ఈసారి దసరా ఉత్సవాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. ఈ విషయమై బీజేపీ, జేడీఎస్ నాయకులు అభ్యంతరం చెబుతున్నారు. సీఎం స్పందిస్తూ కొంత మందికి చరిత్ర తెలియదని, వారు గతంలో దసరా వేడుకల గురించి తెలుసుకుని మాట్లాడాలని సిద్దరామయ్య అన్నారు. బీజేపీ నాయకులు ప్రతీది రాజకీయం చేయాలని ఇలాంటివి లేవనెత్తుతూ ఉంటారన్నారు. అతి కొద్ది మందికి మాత్రమే బుకర్ అవార్డు వచ్చిందని, అందులో బాను ముష్తాక్ ఒకరని తెలిపారు. ఈ అవార్డు పొందిన రెండవ కర్ణాటకవాసి అని గుర్తు పెట్టుకోవాలన్నారు.
అన్ని ధర్మాల వారి ఉత్సవం అది
సీఎం సిద్దరామయ్య
ప్రతిపక్షాలకు చరిత్ర తెలియదని ధ్వజం
ప్రతిసారీ కించపరుస్తారా?
బీజేపీ నేత అశోక్
కాంగ్రెస్, పార్టీకి, ఆ పార్టీ నాయకులకు, వారి ప్రభుత్వానికి మంచి బుద్ధి ఇవ్వాలని, హిందూ భక్తి కేంద్రాలను టార్గెట్ చేయడం వారి మనసులో నుంచి పోవాలని, హిందువుల మనోభావాలను ఇబ్బంది పెట్టకుండా వారికి మంచి బుద్ధిని చాముండేశ్వరి దేవి ప్రసాదించాలని బీజేపీ పక్ష నాయకుడు ఆర్.అశోక్ అన్నారు. ఆదివారం మైసూరులోని చాముండి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. తరువాత విలేకరులతో మాట్లాడారు. చాముండేశ్వరి దేవాలయం హిందువుల ఆలయం కాదని అంటున్నారని, ఇది హిందువులది కాక పోతే మరెవరిదో చెప్పాలని డిమాండ్ చేశారు. మీకు ధైర్యం ఉంటే మసీదు ముందు నిలబడి అదే మాట చెప్పగలరా? అని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. ప్రతిసారీ హిందువులను, దేవాలయాలను ఎందుకు కించపరుస్తున్నారని అన్నారు. చాముండేశ్వరి ఆలయం గొప్ప శక్తి పీఠమని, ఇది హిందువులకు సొంతమని అన్నారు.
మైసూరు దసరా వేడుకలకు మతం లేదు