
చిన్నారి.. అయ్యింది తల్లి
● 9వ తరగతి బాలికకు ప్రసవం
● శివమొగ్గలో సంఘటన
శివమొగ్గ: ప్రాథమిక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలిక గర్భం దాల్చి మగబిడ్డకు జన్మనిచ్చిన సంఘటన శివమొగ్గ నగరంలో జరిగింది. బాలిక, శిశువు ఆరోగ్యంగా ఉన్నారని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. వివరాలు.. బాలిక (15) 9వ తరగతి చదువుతోంది. కడుపు నొప్పిగా ఉందంటూ రెండు రోజుల నుంచి బడికి వెళ్లడం లేదు. శుక్రవారంనాడు ఇంటిలోనే ప్రసవించగా, మగపిల్లాడు పుట్టాడు. కుటుంబ సభ్యులు ఈ విషయం ఎవరికీ చెప్పకుండా గుట్టుగా ఉంచారు. 7వ నెలలోనే కాన్పయినట్లు తెలిసింది. ఆనోటా ఈనోటా ప్రచారం సాగింది. శిశు సంక్షేమ అధికారులు, పోలీసులు బాలిక ఇంటికి వెళ్లి విచారించారు, బాలిక తల్లిదండ్రులు కూలి పనులు చేస్తారని, వారికి మొత్తం ముగ్గురు పిల్లలని సమాచారం. కాగా, తల్లీ కొడుకును ఆస్పత్రిలో చేర్పించారు. బాలిక పైన లైంగిక దాడి చేసిన వారికోసం విచారణ చేపట్టినట్లు జిల్లా ఎస్పీ మిథున్ తెలిపారు. బాలికను కూడా విచారించగా పరస్పర విరుద్ధ సమాచారం చెబుతోందని తెలిసింది. బాలిక కోలుకున్నాక పూర్తి విచారణ సాగిస్తామని పోలీసులు చెప్పారు.
దొంగచే లైంగిక వేధింపులు
దొడ్డబళ్లాపురం: పేయింగ్ గెస్టు హాస్టల్‌లోకి చోరీ చేయడానికి ప్రవేశించిన దొంగ.. ఓ యువతిని లైంగికంగా వేధించిన సంఘటన బెంగళూరు సుద్దగుంటెపాళ్యలో చోటుచేసుకుంది. శనివారం రాత్రి పీజీలోకి జొరబడ్డ దొంగ.. ఓ గదిలో నిద్రిస్తున్న యువతిని అసభ్యంగా తాకసాగాడు. ఆమె మేలుకుని ప్రతిఘటించడంతో, అక్కడ ఉన్న రూ.2500 నగదు దోచుకుని పరారయ్యాడు. యువతి సుద్దగుంటెపాళ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఫారంపాండ్‌లో యువకుడు, మహిళ శవాలు
● ఆత్మహత్యగా అనుమానం
మైసూరు: పొలంలోని ఫారంపాండ్‌లో యువకుడు, మహిళ మృతదేహాలై తేలారు. ఈ సంఘటన చామరాజనగర జిల్లాలోని హనూరు తాలూకాలోని ఒడెయార పాళ్య వద్దనున్న గుళ్యదబయలు అనే ప్రాంతంలో జరిగింది. గుళ్యదబయలు గ్రామానికి చెందిన మీనాక్షమ్మ (32), రవి (30) అనే ఇద్దరు మృతులు. మీనాక్షమ్మకు పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు, రవి అవివాహితుడు, అతడు పొలం పనులు చేసుకునేవాడు. అదే పొలంలో మీనాక్షమ్మ కూలి పనికి పోయేది. అలా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. శనివారం పొలంలో వెల్లుల్లి పంట కత్తిరించి ఇంటికి వెళ్లిన మీనాక్షి, ఇంట్లో నీళ్లు లేవని, పొలానికి వెళ్లి తీసుకొస్తానని వెళ్లింది. మళ్లీ ఆమె తిరిగి రాలేదు. కుటుంబీకులు గాలించగా రవి పొలంలోని నీటి కుంటలో ఇద్దరి శవాలు కనిపించాయి. వారి మధ్య అక్రమ సంబంధం ఉందని, ఈ క్రమంలో గొడవలు వచ్చి కలిసి ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మీనాక్షమ్మ తల్ళి మాత్రం తన బిడ్డను హత్య చేసి నీటిలో పడవేశారని ఆరోపించింది. పోలీసులు కేసు విచారణ చేపట్టారు.

చిన్నారి.. అయ్యింది తల్లి