
నిధుల్లేక.. చతికిలబడి!
జిల్లాలో ‘మన ఊరు– మనబడి’ పథకం ఇలా..
అమ్మ ఆదర్శ పాఠశాల పథకం
‘మనఊరు– మనబడి’కి నిధుల గ్రహణం
పాఠశాలల్లో నిలిచిపోయిన పనులు
బిల్లులు రాక తలలు పట్టుకుంటున్న ఎస్‌ఎంసీ చైర్మన్లు, కాంట్రాక్టర్లు
జిల్లాలో రూ.4కోట్లకుపైగా బకాయిలు పెండింగ్
కరీంనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్ప నకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మన ఊరు– మనబడి’ పథకం మధ్యలో నిలిచిపోయింది. బిల్లులు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్టర్లు పనులను ఆపేశారు. ‘మన ఊరు–మనబడి’ కార్యక్రమాన్ని జిల్లాలో 2021–22 ఏడాదిలో చేపట్టారు. 230 ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు రూ.36.05 కోట్లు ప్రతిపాదించారు. కొన్నిచోట్ల పనులు పూర్తయి మూడేళ్లు గడుస్తున్నా బిల్లులు చెల్లించకపోవడంతో ఎస్‌ఎంసీ కమిటీ చైర్మన్లు, కాంట్రాక్టర్లు తలలు బాదుకుంటున్నారు. పనులు పూర్తిచేసినా రూ.4కోట్లకుపైగా బిల్లులు రాలేదంటూ ఆందోళన చెందుతున్నారు.
‘అమ్మ’ ఆదర్శ కమిటీలతో..
ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్‌ఎంసీ కమిటీలు రద్దయి అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పడ్డాయి. జిల్లాలో 340 పాఠశాలల అభివృద్ధికి ప్రస్తుత ప్రభుత్వం రూ.9.39 కోట్లు విడుదల చేసింది. పనులు వేగంగా పూర్తయ్యాయి. మన ఊరు– మన బడి పథకం కింద మొదటి విడతగా ఎంపిక చేసిన 230 పాఠశాలలకు గాను 130పాఠశాలల్లో పనులు ప్రారంభం కాకపోవడం గమనార్హం. నిధులు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్లు, ఏఎంసీ చైర్మన్లు ఈ పనులు మాకొద్దంటూ చేతులేత్తేశారు.
అసంపూర్తిగా పనులు
మనఊరు– మనబడి కింద మానకొండూర్ మండలంలోని 18 పాఠశాలల్లో పనులు చేపట్టారు. పచ్చునూర్‌లోని యాదవ్‌నగర్, మానకొండూర్ గర్ల్స్ హైస్కూల్, వెల్ది ఉన్నత పాఠశాలల్లో చేపట్టిన పనులకు ఇంకా బిల్లులు రాలేదు. చిగురుమామిడి మండలం ఇందుర్తి, నవాబుపేట, చిగురుమామిడి, రేకొండ, సుందరగిరిలో 50శాతం పనులు పూర్తయ్యాయి. నిధుల్లేక మిగితా పనులు నిలిచిపోయా యి. గన్నేరువరం మండలం హన్మాజీపల్లి, మాదా పూర్‌లో పనులు పూర్తయినా బిల్లులు రాలేదు. హుజురాబాద్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో రూ.20లక్షలతో చేపట్టిన వంటశాల పనులను నిధుల్లేక కాంట్రాక్టర్ మధ్యలో నిలిపివేశాడు.
ఎంపిక చేసిన పాఠశాలలు 230
మంజూరైన నిధులు రూ.36.05 కోట్లు
పనులు పూర్తయిన పాఠశాలలు 100
ఖర్చయిన నిధులు రూ.13.23 కోట్లు
పనులు ప్రారంభం కాని స్కూళ్లు 130
ప్రతిపాదించిన పాఠశాలలు 340
మంజూరైన నిధులు రూ.9.39 కోట్లు
పనులు పూర్తయిన పాఠశాలలు 340
ఖర్చయిన నిధులు రూ.9.39 కోట్లు