Telangana News: ఎట్లున్న సిరిసిల్ల ఎట్లయిందో..
Sakshi News home page

ఎట్లున్న సిరిసిల్ల ఎట్లయిందో..

Oct 18 2023 1:38 AM | Updated on Oct 18 2023 10:12 AM

- - Sakshi

సిరిసిల్ల ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌,చిత్రంలో కేటీఆర్‌ తదితరులు

కరీంనగర్: కన్నీళ్లు తప్ప నీళ్లు లేని సిరిసిల్ల.. ఇప్పుడు సజీవ జలధార అయ్యిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడారు. మండుటెండల్లోనూ అప్పర్‌ మానేరు మత్తడి దూకుతుందని, స్వరాష్ట్రం మనం సాధించుకున్న ప్రగతికి చిహ్నమన్నారు.

బీడు భూములకు సాగునీరు వచ్చింది.. రైతులు పంటలు పండిస్తుండ్రు.. ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతులు కుదుటపడుతున్నారని పేర్కొన్నారు. సిరిసిల్ల నేత కార్మికుల ఆత్మహత్యలు తనను కదిలించాయని, ఉద్యమ సమయంలోనే నేతన్నలు చావొద్దని చెబుతూ, పార్టీ పరంగా రూ.50లక్షలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. బతుకమ్మ చీరలతో కార్మికుల జీవితాలకు కొంత భరోసా దొరికిందన్నారు. విద్యా కేంద్రంగా సిరిసిల్ల అభివృద్ధి చెందుతుందని వివరించారు.

ఎట్లున్న సిరిసిల్ల ఎట్లయ్యిందో మీరే ఆలోచించాలే అని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్‌ గురించి పొగిడితే తనను తానే పొగిడినట్లు అవుతుందన్నారు. సిరిసిల్ల ప్రాంత సమస్యల గురించి తెలిసిన వాడిగా, భవిష్యత్‌లో మరిన్ని మంచి పనులు జరుగుతాయని సీఎం పేర్కొన్నారు. కేటీఆర్‌ మంచి భవిష్యత్‌ ఉన్న నాయకుడని స్పష్టం చేశారు. మరోసారి ఆయన్ని గెలిపించాలని కోరారు.

అన్నిరంగాల్లో అభివృద్ధి
ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. అన్ని రంగాల్లోనూ రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి సాధించిందని, రాష్ట్రంలోనే కేజీ టూ పీజీ క్యాంపస్‌ గంభీరావుపేటలో ఉందన్నారు. ఆరున్నర మీటర్ల భూగర్భ జలాలు పెరిగి ఐఏఎస్‌లకు పాఠ్యాంశంగా రాజన్న సిరిసిల్ల మారిందని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తెలంగాణ ఉద్యమ సమయంలోని అంశాలను ప్రస్తావిస్తూ, ప్రతీ సమయంలో కేసీఆర్‌కు అండగా సిరిసిల్ల ప్రాంతం నిలిచిందన్నారు.

ఈసందర్భంగా సిరిసిల్లలోని పద్మశాలీ సంఘం, అంబేద్కర్‌ సంఘం, పాలిస్టర్‌ అసోసియేషన్‌, టెక్స్‌టైల్‌పార్క్‌, యాదవ సంఘం, రజక సంఘం, శాలివాహన సంఘం ప్రతినిధులు కేటీఆర్‌కు మద్దతు ప్రకటించారు.

సభలో ఎమ్మెల్సీలు ఎల్‌.రమణ, రఘోత్తమరెడ్డి, మధుసూదనాచారి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, వేములవాడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చెలిమెడ లక్ష్మీనర్సింహారావు, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, టీపీటీడీసీ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, ‘సెస్‌’ చైర్మన్‌ చిక్కాల రామారావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, రైతుబంధు సమితి చైర్మన్‌ గడ్డం నర్సయ్య, బీఆర్‌ఎస్‌ నాయకులు చీటి నర్సింగరావు, అక్కరాజు శ్రీనివాస్‌, బొల్లి రామ్మోహన్‌, కల్వకుంట్ల గోపాల్‌రావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

బతుకమ్మలతో సభకు..
సిరిసిల్లలో ప్రజా ఆశీర్వాదసభ సక్సెస్‌ కావడం బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో నూతోనోత్సాహం నిండింది. సిరిసిల్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి బీఆర్‌ఎస్‌ శ్రేణులు సభకు తరలివచ్చారు. సిరిసిల్ల పట్టణంలోని అన్ని వార్డుల నుంచి మహిళలు బతుకమ్మలతో హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement