వచ్చేనెలలో వన్యప్రాణుల గణన
● ఆరు రోజులపాటు నిర్వహిస్తాం
● కామారెడ్డి ఎఫ్‌డీవో రామకృష్ణ
నాగిరెడ్డిపేట : ప్రతి నాలుగేళ్లకోసారి చేపట్టే వన్యప్రాణుల గణన జిల్లాలో నవంబర్ నెలాఖరులో ప్రారంభమవుతుందని కామారెడ్డి ఫారెస్ట్ డివిజన్ అధికారి రామకృష్ణ తెలిపారు. నాగిరెడ్డిపేట ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని లొంకలపల్లి శివారులో చిరుత పులి సంచరిస్తున్న విషయం తెలుసుకున్న ఆయన సోమవారం ఆ ప్రాంతంలో పర్యటించారు. చిరుత పులి పాదముద్రలతోపాటు చిరుతను గుర్తించేందుకు ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన సెన్సార్ కెమెరాలను పరిశీలించారు. సిబ్బందికి సూచనలు ఇచ్చారు. అనంతరం మాల్తుమ్మెద శివారులోని ఫారెస్ట్ నర్సరీని సందర్శించి నర్సరీలోని మొక్కల వివరాలను తెలుసుకున్నారు. నాగిరెడ్డిపేట ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి చేరుకుని రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఆరురోజులపాటు వన్యప్రాణుల గణన ప్రక్రియ చేపడతామన్నారు. ప్రత్యక్షంగా చూడడంతోపాటు వన్యప్రాణులు వదిలిన విసర్జితాలు, సెన్సార్ కెమెరాల ఆధారంగా గణన ప్రక్రియ సాగుతుందన్నారు. గణన ప్రక్రియ పూర్తయిన తర్వాత 2026 రిపోర్ట్ తయారు చేస్తామన్నారు. గతేడాది డివిజన్ పరిధిలో 50 వేల మొక్కలను నాటామని, వచ్చే ఏడాది లక్ష మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. రెండేళ్లలో జిల్లాలో ఎక్కడా అటవీ భూమి ఆక్రమణకు గురికాలేదన్నారు. అటవీ ప్రాంతంలోకి వెళ్లేందుకు అనేక అక్రమ దారులున్నాయని, వాటిలో దాదాపు 50 శాతం దారులను మూసేశామని, రానున్న రోజుల్లో అన్నింటిని మూసేస్తామని తెలిపారు. ఆయనవెంట నాగిరెడ్డిపేట డీఎఫ్‌ఆర్‌వో రవికుమార్, బీట్ ఆఫీసర్ నవీన్ తదితరులున్నారు.


