
ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలి
కామారెడ్డి టౌన్: ఇందిరమ్మ ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ లబ్ధిదారులకు సూచించారు. బుధవారం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డు అడ్లూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామానికి చెందిన గండ్ల హేమలతకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని, 575 ఎస్‌ఎఫ్‌టీ విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకోవాలని సూచించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు. హేమలత మాట్లాడుతూ తన భర్త మరణించాడని, బీడీలు చుడుతూ ఇద్దరు కుమారులను చదివిస్తున్నానని పేర్కొంది. తనకు ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసినందుకు సంతోషంగా ఉందని తెలిపింది. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి, హౌసింగ్ పీడీ జైపాల్‌రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.