
భవిత కేంద్రాలకు మహర్దశ
● నిజామాబాద్‌లో 29 కేంద్రాల
మరమ్మతులకు రూ.68.05 లక్షలు,
● కామారెడ్డిలో 22 కేంద్రాలకు రూ.51.62 లక్షలు మంజూరు
● టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ కోసం
రూ.14 లక్షలు కేటాయింపు
ఆర్మూర్: సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగంలోని దివ్యాంగ విద్యార్థులకు మరింత మెరుగైన శిక్షణనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. అందులో భాగంగా భవిత కేంద్రాల్లో టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ (టీఎల్‌ఎమ్)తోపాటు భవనాల మరమ్మతులకు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణ ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని దివ్యాంగ విద్యార్థులకు భవిత కేంద్రాల్లో అవాంతరాలు లేని పరిసరాల్లో విద్యా బోధన చేయడానికి ఏర్పాట్లు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో శాశ్వత భవనాలు ఉన్న 156 భవిత కేంద్రాలకు, ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న 446 కేంద్రాలకు కలిపి మొత్తం 602 భవిత కేంద్రాల మరమ్మతులకు రూ. 14 కోట్ల 12 లక్షల 73 వేలు మంజూరు చేశారు.
ఉమ్మడి జిల్లాలో మరమ్మతుల కోసం..
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భవిత కేంద్రాల మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని శాశ్వత భవనాలు ఉన్న ఏడు కేంద్రాలతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న 22 కేంద్రాల్లో మరమ్మతుల కోసం రూ.68,05,517 మంజూరు చేశారు. కామారెడ్డి జిల్లాలో శాశ్వత భవనాలు ఉన్న ఐదు కేంద్రాలతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న 17 కేంద్రాల్లో మరమ్మతుల కోసం రూ.51,62,806 మంజూరయ్యాయి. మరమ్మతు పనులకు ఇంజినీర్లతో అంచనాలు సైతం రూపొందించారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో భవిత కేంద్రాల్లో ఫ్రెండ్లీ టాయిలెట్లు, ర్యాంపులు, రెయిలింగ్, వాల్ పెయింటింగ్స్, అవసరం ఉన్నచోట భవన నిర్మాణా ల మరమ్మతులు చేయించాల్సి ఉంటుంది.
టీఎల్‌ఎం కోసం..
జిల్లాలోని శాశ్వత భవనాలు ఉన్న నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ఎడపల్లి, మోర్తాడ్, సిరికొండ, నందిపేట్‌లలోని భవిత కేంద్రాలకు టీఎల్‌ఎంతోపాటు అవసరమైన పరికరాల కొనుగోలుకు నిధులు మంజూరయ్యాయి. ప్రతి కేంద్రానికి రూ. 2 లక్షల చొప్పున మొత్తం రూ. 14 లక్షలు కేటాయించారు. జిల్లా విద్యాధికారి సూచనల మేరకు మండలాల ఎంఈవో, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు, భవిత కేంద్రం నిర్వహిస్తున్న ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో కలిపి కమిటీ వేసి పరికరాలను కొనుగోలు చేయనున్నారు.