
బడిలో సెల్‌పై ఆంక్షలు!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఉచ్ఛతర ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు అన్నీ కలిపి 1,011 ఉన్నాయి. వాటిలో దాదాపు లక్ష మంది విద్యార్థులు చదువుతున్నారు. 4 వేల పైచిలుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. చాలామంది ఉపాధ్యాయులు బాధ్యతగా పనిచేస్తూ, తమకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అయితే కొద్దిమంది మాత్రమే విధులు ఎగ్గొడుతూ యూనియన్ రాజకీయాలు, సొంత వ్యాపారాలతో బిజీగా ఉంటున్నారు. స్కూల్‌కు వచ్చినా నిరంతరం ఫోన్‌లో మునిగితేలుతున్నారు. పేరెంట్స్ స్కూల్‌కు వెళ్లినపుడు కొందరు టీచర్లు సెల్‌ఫోన్ సంభాషణలు, చాటింగ్‌లతో కాలక్షేపం చేస్తుండడాన్ని చూసి తల్లిదండ్రులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి కొందరి మూలంగా ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం సడలుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు బడిలో సెల్‌ఫోన్ వాడకంపై ఆంక్షలు విధించేందుకు చర్యలు చేపట్టారు. ఇటీవల జరిగిన విద్యాశాఖ అధికారుల సమావేశంలో తరగతి గదిలో ఏ ఉపాధ్యాయుడు కూడా సెల్‌ఫోన్ వాడకూడదంటూ ఆదేశాలు ఇవ్వాలని, ఆకస్మిక తనిఖీలు చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కొందరి వల్ల చెడ్డపేరు..
ఉపాధ్యాయుల్లో చాలా మంది విధ్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకు శ్రమిస్తున్నారు. కొందరైతే ప్రత్యేక తరగతులు కూడా తీసుకోవడం, విద్యార్థులను వారికి ఇష్టమైన రంగాల్లో ప్రోత్సహించడం ద్వారా వారిలోని నైపుణ్యాన్ని వెలికితీస్తూ వారికి వెన్నంటూ నిలుస్తున్నారు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పరిశోధనల్లో దూసుకుపోతున్నారు. ఆటలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ సత్తా చాటుతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకన్నా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే ఆయా రంగాల్లో సక్సెస్ అవుతున్నారు. వారికి గైడ్‌గా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయులు చేస్తున్న శ్రమ వల్లే విద్యార్థులు రాణిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు చిన్నచిన్న అవసరాలకు సొంతంగా డబ్బులు ఖర్చు చేసేవారు ఉన్నారు. అయితే ఇంత కష్టపడుతున్న ఉపాధ్యాయులు ఒకవైపు ఉంటే, కొందరు మాత్రం బడులకు రాకుండా రాజకీయాలతో కాలక్షేపం చేస్తూ విధులను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒకరిద్దరు డుమ్మాల మాస్టర్లు, బిజినెస్ టీచర్ల ధోరణితో మిగతావారికీ చెడ్డపేరు వస్తోంది. ఆ కొందరిపై అధికారుల అజమాయిషీ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందనే భావన అందరిలోనూ ఉంది. అధికారులను మేనేజ్ చేసుకుని బడికి డుమ్మా కొట్టి సొంత వ్యాపకాల్లో మునిగిపోయి కొందరు, బడికి వచ్చినా తమ వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాలపై సెల్‌ఫోన్లలో నిమగ్నమవుతూ మరికొందరు ఉంటున్నారు.
సెల్ వద్దంటే ఎలా?
బడిలో సెల్‌ఫోన్ వాడొద్దన్న విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలపై ఉపాధ్యాయులు భి న్నంగా స్పందిస్తున్నారు. సెల్‌ఫోన్ వాడకుండా ఉండడమే మంచిదని కొందరు అంటుండగా, మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. కు టుంబ సభ్యుల నుంచి అత్యవసర పరిస్థితుల్లో కాల్ వస్తే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే స్కూల్‌లో మధ్యాహ్న భోజనానికి సంబంధించి విద్యార్థుల హాజరు విషయంలో ఫేస్ రికగ్నైజేషన్‌కు సెల్‌ఫోన్ వాడాల్సి ఉంటుందని, చాలా స మాచారం ఫోన్ల ద్వారానే పంపుతామని పే ర్కొంటున్నారు. సెల్‌ఫోన్ వాడద్దంటే ఈ పనులన్నీ ఎలా చేయాలన్న ప్రశ్నలు ఉత్పన్నమవు తున్నాయి. ఫేస్ రికగ్నైజేషన్, ఆన్‌లైన్ వర్క్స్ కోసం ట్యాబ్‌లు గానీ, ఇతర పరికరాలుగానీ అందిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సెల్‌ఫోన్ వాడొద్దంటూ విద్యాశాఖ ఆదేశాలు
అతిక్రమించేవారిపై చర్యలు
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమలులోకి..
ఉపాధ్యాయుల్లో
భిన్నాభిప్రాయాలు
బడిలో సెల్‌ఫోన్ వినియోగంపై ఆంక్షలు విధించాలని విద్యాశాఖ నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరంనుంచి ఇది అమలులోకి రానుంది. తరగతి గదిలో సెల్‌ఫోన్ వినియోగించకుండా చూడాలని ఇప్పటికే విద్యాశాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. జిల్లా అధికారులు స్కూళ్లను తనిఖీ చేసి, సెల్‌ఫోన్ వాడే వారిపై చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేసింది. దీంతో ఉపాధ్యాయుల్లో బడిలో సెల్ వాడకంపై చర్చ నడుస్తోంది.

బడిలో సెల్‌పై ఆంక్షలు!