ఎల్లారెడ్డి: డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులు చెల్లించడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ శుక్రవారం సోమార్‌పేట్ గ్రామస్తులు ఎల్లారెడ్డిలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమార్‌పేట్ గ్రామానికి చెందిన పది మందికి 2023లో డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరయ్యాయన్నారు. ఇళ్లు నిర్మించుకుని ఏడాది కావస్తున్నా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా బిల్లు చెల్లించలేదన్నారు. ఎమ్మెల్యే సూచనతో అధికారులు రెండు నెలల క్రితమే ఇళ్ల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసినా ఇప్పటివరకు బిల్లులు మంజూరు చేయలేదన్నారు. బిల్లుల కోసం తలా కొంత జమ చేసి డీఈఈ గిరిధర్‌కు లక్షన్నర రూపాయలు అందించామన్నారు. అధికారులు మరిన్ని డబ్బులు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని సముదాయించి రాస్తారోకో విరమింపజేశారు. బిల్లుల ఈ విషయమై డీఈఈ గిరిధర్‌ను వివరణ కోరగా సోమార్‌పేట్ గ్రామస్తులకు సంబంధించిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల వివరాలు 15 రోజుల క్రితమే ఆన్‌లైన్‌లో నమోదయ్యాయన్నారు. లబ్ధిదారులు ఇంతవరకు వారి ఇళ్లకు సంబంధించిన అగ్రిమెంట్ కాపీలను అందించలేదన్నారు. తనకు ఎవరూ డబ్బులు ఇవ్వలేదని, అనవసరంగా తనపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి డబ్బులు రాగానే కాంట్రాక్టర్ ద్వారా లబ్ధిదారులకు అందిస్తామన్నారు.