
పాల్వంచ గ్రామం
సాక్షి, కామారెడ్డి/మాచారెడ్డి: జిల్లాలో మరో మండలం ఏర్పాటయ్యింది. మాచారెడ్డి మండలంలోని పాల్వంచ కేంద్రంగా రెవెన్యూ మండలాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తెలిపారు. పాల్వంచను మండలంగా ఏర్పాటు చేయా లని తాను ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్‌కు విన్నవించగా పరిశీలించి మండలం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. త్వరలోనే మంత్రుల చేతుల మీదుగా మండలాన్ని ప్రారంభిస్తామన్నారు. తన వినతి మేరకు పాల్వంచ మండలాన్ని ఏర్పాటు చేసినందుకు సీఎంకు, మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 23 మండలాలు ఉండగా.. పాల్వంచతో కలిపి మండలాల సంఖ్య 24కు చేరింది.
కొత్త మండలం పరిధిలో..
మాచారెడ్డి మండలంలోని పాల్వంచ, ఎల్పుగొండ, వాడి, ఫరీదుపేట, బండరామేశ్వర్‌పల్లి, ఇసాయిపేట, దేవునిపల్లి, పోతారం, భవానీపేట రెవెన్యూ గ్రామాలతో పాటు రామారెడ్డి మండలంలోని సింగరాయపల్లి గ్రామాన్ని కలిపి పాల్వంచ మండలాన్ని ఏర్పాటు చేశారు. గెజిట్ విడుదల కావడంతో మండలం ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. పాల్వంచలో మండల పరిషత్, తహసీల్దార్, పోలీసు స్టేష న్‌ల ఏర్పాటు కోసం భవనాలను వెతకాల్సి ఉంది.
పెండింగ్‌లో మరో రెండు..
జుక్కల్ నియోజకవర్గంలోని మహ్మద్‌నగర్, బాన్సువాడ నియోజకవర్గంలోని హన్మాజీపేట మండలాల ఏర్పాటు అంశం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఆయా ప్రాంతాల ప్రజలు మండలం ఏర్పాటు చేయాలని చాలాకాలంగా కోరుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం కోసం వేచిచూస్తున్నారు.
గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం
పది గ్రామాలతో మండలం ఏర్పాటు