భూసేకరణ పనులు వేగవంతం చేయాలి ˘
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్‌తో కలిసి రూరల్ మండలం వాకలపూడి నుంచి అన్నవరం వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి భూ సేకరణ పురోగతి, కాకినాడ సెజ్ భూములను రైతుల పేరున బదిలీ చేసే ప్రక్రియపై రెవెన్యూ, కేఎస్‌ఈజెడ్, నేషనల్ హైవే అధికారులతో ఆయన సమీక్షించారు. కాకినాడ పోర్టును జాతీయ రహదారులకు అనుసంధానం చేసే ప్రక్రియలో భాగంగా వాకలపూడి నుంచి అన్నవరం వరకు నిర్మించిన జాతీయ రహదారికి అవసరమైన భూ సేకరణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జిల్లాలో యు.కొత్తపల్లి, తొండంగి మండలాల్లో ఎస్‌ఈజెడ్ లిమిటెడ్ కింద కాకినాడ డివిజన్, పెద్దాపురం డివిజన్ పరిధిలో ప్రత్యామ్నాయ భూమి 259.040 ఎకరాలు, రైతులు వదిలేసిన భూమి 930.176 ఎకరాలను 1,545 మంది రైతులకు బదిలీ చేయాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో భూముల రిజిస్ట్రేషన్ వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, కాకినాడ, పెద్దాపురం ఆర్డీవోలు ఎస్.మల్లిబాబు, కె.శ్రీరమణి పాల్గొన్నారు.
టెట్‌కు 334 మంది హాజరు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్)–25 పరీక్ష కాకినాడ జిల్లాలో మూడు కేంద్రాలలో బుధవారం నిర్వహించామని జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్ తెలిపారు. పరీక్షకు 365 మంది హాజరుకావలసి ఉండగా 334 మంది హాజరయ్యారని తెలియజేశారు. అన్ని పరీక్ష కేంద్రాలలో పరీక్ష ప్రశాంతంగా నిర్వహించామన్నారు.
పాదగయ హుండీ ఆదాయం రూ.24.73 లక్షలు
పిఠాపురం: రాజరాజేశ్వరీ సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం పాదగయ హుండీ ఆదాయం రూ.24.73 లక్షలు సమకూరినట్లు ఈఓ కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ తెలిపారు. దేవదాయ ధర్మదాయ శాఖ డీఈఓ కనపర్తి నాగేశ్వరరావు, ఇన్‌స్పెక్టర్ వడ్డి ఫణీంద్ర కుమార్, పర్యవేక్షణలో బుధవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 68 రోజులకు హుండీల ద్వారా రూ. 23,32,155, అన్నదానం ద్వారా రూ.1,41,215 మొత్తం రూ.24,73,370 ఆదాయం వచ్చిందని తెలిపారు.
ర్యాలిలో వైభవంగా పవిత్రోత్సవాలు
కొత్తపేట: ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలోని జగన్మోహినీ కేశవ, గోపాలస్వామి వారి క్షేత్రంలో పవిత్రోత్సవాలు రెండో రోజు బుధవారం వైభవంగా కొనసాగాయి. ఆలయ ఈఓ భాగవతుల వెంకట రమణ మూర్తి పర్యవేక్షణలో ప్రముఖ ఆగమ శాస్త్ర పండితుడు శ్రీనివాసుల వెంకటాచార్యులు బ్రహ్మత్వంలో ప్రత్యేక పూజలు జరిపారు.
భూసేకరణ పనులు వేగవంతం చేయాలి ˘


