
టీడీపీ నేత కన్ను
పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నగర పంచాయతీలో జరుగుతోన్న భూ భాగోతమిది. ఈ భాగోతం ప్రస్తుతం కాకినాడ రెవెన్యూలో హాట్‌టాపిక్‌గా మారింది. నగర పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 579లో గ్రామ పంచాయతీకి 1.52 ఎకరాల భూమి గ్రామ కంఠంగా ఉంది. ఈ విషయం గొల్లప్రోలు ఫెయిర్ అడంగల్‌లో స్పష్టంగా ఉందని అక్కడి ప్రజలు, నేతలు చెబుతున్నారు. గొల్లప్రోలు నగర పంచాయతీలో ఇళ్ల నిర్మాణాలు పెరగడంతో ఇక్కడ భూముల ధరలు బాగా పెరిగాయి. ఈ ఎకరా 52 సెంట్లు భూమి 7,296 గజాలు వస్తోంది. తహసీల్దార్ కార్యాలయానికి సమీపాన తాటిపర్తి రోడ్డు పక్కన గజం రూ.30వేలు పైనే పలుకుతోంది. అదే ఈ భూమికి పరిసరాల్లో గజం రూ.20వేలు ఉంది. ఈ లెక్కన చూసుకుంటే గ్రామకంఠంగా చెబుతోన్న ఈ భూమి విలువ సుమారు రూ.15 కోట్లు పలుకుతోంది. ఈ ప్రాంతంలో భూముల విలువ పెరిగిపోవడంతో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత కన్ను దీనిపై పడింది. అలాగని ఆయన ఎక్కడా బయట పడకుండా తెరవెనుక చక్రం తిప్పుతూ భూ బదలాయింపు ప్రక్రియ నడిపిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.