
వాహనం అదుపుతప్పి యువకుడి మృతి
ఆలమూరు: స్థానిక జాతీయ రహదారిలోని చొప్పెల్ల వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తపల్లి ఆనంద్ (29) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం మడికి గ్రామానికి చెందిన ఆనంద్ రాజమహేంద్రవరంలోని ఐసీఐసీఐ క్రెడిట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. వ్యక్తిగత పని మీద తన బైక్‌పై రావులపాలెం వైపు వెళ్తుండగా స్థానిక లాకుల వద్ద అదుపు తప్పి కల్వర్టు గోడను ఢీకొట్టాడు. దీంతో ఆనంద్‌కు తలపై బలమైన గాయమై రక్తం పోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై అశోక్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్టుమార్టంకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆనంద్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏడాది క్రితం అతడికి వివాహం కాగా భార్య, ఒక పాప ఉన్నారు.
ట్రాక్టర్ ఢీకొని..
పిఠాపురం: గొల్లప్రోలు మండలం ఏకే మల్లవరం రైల్వే గేటు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కథనం మేరకు అల్లూరిసీతారామరాజు జిల్లా ముంచంగిపుట్ట మండలం మచ్చేపురానికి చెందిన కోడ మోహన్ గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారు లక్ష్మీపురంలో చేపల చెరువుల వద్ద పని చేస్తున్నాడు. ఆదివారం చేపల పట్టుబడి ఉండడంతో ఇతర కూలీలకు భోజనాలు తేవడానికి మోటారు సైకిల్‌పై చేబ్రోలు వెళ్లి తిరిగి వస్తుండగా ఏకే మల్లవరం రైల్వే గేటు వద్ద అత్యంత వేగంగా వచ్చిన ట్రాక్టర్ మోహన్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్సులో పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఎస్సై ఎన్.రామకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
లారీ ఢీకొని..
తుని రూరల్: తుని మండలం టి.తిమ్మాపురం జంక్షన్ సమీపంలో లారీ ఢీ కొనడంతో స్కూటీపై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందినట్టు రూరల్ ఎస్సై బి.కృష్ణమాచారి తెలిపారు. ఆదివారం విజయవాడ రాణీపేటకు చెందిన బూరాడ పట్టాభినాయుడు శుభలేఖలు ఇచ్చేందుకు శ్రీకాకుళం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. లారీ ఢీ కొనడంతో పట్టాభినాయుడు అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వివరించారు.