
స్వామిపేరు చెప్పి స్వకార్యం
● సౌకర్యాల మాటున స్వలాభం
● వాడపల్లి వెంకన్న క్షేత్రంలో
నిబంధనలకు తిలోదకాలు
● అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు
తలొగ్గుతున్న అధికారులు
కొత్తపేట: జిల్లాలోని వాడపల్లి క్షేత్రంలో కూటమి నేతల స్వాహాకారాలు మిన్నంటుతున్నాయి. ఆలయంలో భక్తులకు కల్పించే వసతులు, సౌకర్యాలు, ప్లైఓవర్స్, క్యూలైన్లకు సంబంధించి ప్రతి పనిలో అధికారులు నిబంధనలకు తిలోదాలిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాలకవర్గం నియామకం కాకపోయినా పాలకుల ఆశీస్సులు మెండుగా ఉన్నాయని చెప్పుకొంటున్న ఒక నాయకుడు అనధికార చైర్మన్‌గా పెత్తనం సాగిస్తున్నాడు. అంతా తన కనుసన్నల్లోనే జరగాలన్నట్టు వ్యవహరిస్తున్నారని, దీంతో అధికారులు సిబ్బంది ఆయన అడుగులకు మడుగులొత్తుతున్నారని స్వయంగా అధికార పార్టీ వారితో పాటు స్థానికులు ఆరోపిస్తున్నారు. వాహనాల పార్కింగ్‌కు కేటాయించిన సుమారు 8 ఎకరాల విస్తీర్ణాన్ని ఎలాంటి అనుమతులు, టెండర్లు లేకుండానే రూ.కోట్ల వ్యయంతో మెరగ చేయిస్తున్నారు. ఫ్లై ఓవర్లు, క్యూలైన్లు, ఇతర సౌకర్యాలకు సంబంధించి నిర్మాణాల్లో నిబందనలకు తిలోదకాలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అంతవరకూ పనిచేసిన తాత్కాలిక ఉద్యోగులను తొలగించి తమ అనుయాయులను పలు పోస్టుల్లో నియమించుకుని ఇష్టానుసారం వేతనాలు ఇస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
వర్షాలు వస్తే వాహనాలు దిగబడకుండా
వాహనాల పార్కింగ్ స్థలాన్ని నాలుగు అడుగుల మేర మెరక చేసేందుకు ప్రతిపాదనలు పంపించాం. అనుమతులు వచ్చాక టెండర్లు పిలుస్తాం. వర్షాకాలం సమీపిస్తుండడంతో వాహనాలు దిగబడిపోకుండా గోతులు పూడ్చాలని మండలంలోని ఇసుక ర్యాంపుల వారిని కోరాము. వారు మట్టిని ఉచితంగానే తోలి మెరకకు సాయం చేస్తున్నారు. రెండు ఫ్లైఓవర్‌లలో ఒకటి డోనర్ ఇచ్చిన రూ.ఐదు లక్షలతో నిర్మించగా మరొకటి డిపార్ట్‌మెంట్ ఎగ్జిక్యూషన్ మేరకు రూ.6 లక్షలతో నిర్మించినట్టు తెలిపారు. వాడపల్లి క్షేత్రంలో అన్ని పనులు నిబంధనలకు అనుగుణంగానే చేస్తున్నట్టు తెలిపారు.
– నల్లం సూర్య చక్రధరరావు, ఈవో