
ఖైదీలకు ఈ– ములాఖత్
జైళ్ళ శాఖ డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్
కంబాల చెరువు (రాజమహేంద్రవరం): జైళ్ల శాఖలో చేపట్టనున్న సంస్కరణలలో భాగంగా రాష్ట్రంలో ఉన్న జైళ్లలో కృత్రిమ మేధ ఉపయోగించి సిబ్బందిపై ఉన్న ప్రస్తుత పనిభారాన్ని తగ్గించనున్నామని జైళ్ళ శాఖ డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్ తెలిపారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ఖైదీల బ్యారక్‌లు, ఆరుబయలు జైలు, జైలు ఆవరణలోని వ్యవసాయ క్షేత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా కారాగారంలో పనిచేస్తున్న గార్డెనింగ్ సిబ్బందితో సమావేశమయ్యారు. వారి సమస్యలు తెలుసుకుని సూచనలు చేశారు. ‘కృత్తిమ మేధ’’ ద్వారా గార్డెనింగ్ సిబ్బంది పై ప్రస్తుతం ఉన్న భారాన్ని తగ్గించి పటిష్టమైన భద్రతాచర్యలు చేపట్టబోతున్నామని తెలిపారు. ఖైదీలు ఈ – ములాఖత్ ద్వారా కారాగారం నుంచి కుటుంబ సభ్యులతో, బంధువులతో నేరుగా వీడియో కాల్ ద్వారా మాట్లాడేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. కలెక్టర్ పి.ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిశోర్, మునిసిపల్ కమిషనరు కేతన్‌కార్గే ఆయనను కలిశారు. ఆయన వెంట జైళ్ళ శాఖ కోస్తా ప్రాంత ఉపశాఖాధికారి రవి కిరణ్, జైలు సూపరింటెండెంట్ రాహుల్, జైలు అధికారులు ఉన్నారు.