
ఉద్యోగులను మోసం చేసిన చంద్రబాబు
ప్రత్తిపాడు: పరిపాలనానుభవం అపారంగా ఉందని పదే పదే చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలనే కాక ఉద్యోగులను సైతం మోసం చేశారని వైఎస్సార్ సీపీ పెన్షనర్ల వింగ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి చిలకమర్తి సాయి ప్రసాద్ విమర్శించారు. ప్రత్తిపాడులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీపీఎస్ రద్దు కోసం మూడు లక్షల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయన్నారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు అనేక హామీలిచ్చిన కూటమి నేతలు గద్దెనెక్కిన తర్వాత హామీలన్నీ గాలికి వదిలేశారన్నారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వం రూ. 30 వేల కోట్లు బకాయిలు ఉండగా కేవలం రూ.7,300 కోట్లు విడుదల చేసిందన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, సచివాలయ ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్ స్కేలు ఇవ్వాలని, ఐఆర్ 30 శాతం ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.