
సర్కారు వారి నిర్లక్ష్యం.. అన్నదాతకు శాపం
జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్న రైతులు
●
● ముందుగానే కొని ఉంటే ముప్పు తప్పేదే
● తడిసి ముద్దయిన రైతుల ఆశలు
● ఇప్పుడు హడావుడి చేసి లాభం ఏమిటి?
● నాదెండ్ల పర్యటనపై రైతుల పెదవి విరుపు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న’ చందంగా ఉంది కూటమి సర్కారు తీరు. అకాల వర్షాలతో రైతులు నిండా మునిగి నష్టపోయాక ధాన్యం కొనుగోలు చేస్తామంటూ హడావుడి చేస్తోంది. రబీ వరి కోతలు ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోళ్లకు సమాయత్తమవ్వాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడమే తమకు శాపంగా మారిందని జిల్లాలోని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పేరుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా రైతులకు మాత్రం ఎక్కడా మద్దతు ధర దక్కనే లేదు. రైతుల కష్టం దళారుల పాలైనా పట్టించుకోని సర్కారు.. ఇప్పుడు హడావుడి చేసి లాభమేమిటని రైతు నేతలు ప్రశ్నిస్తున్నారు. అకాల వర్షాలతో రోడ్ల పైన, కళ్లాల్లోను ధాన్యం తడిసి ముద్దయి, తాము నష్టపోవడానికి ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడమే కారణమని రైతులు మండిపడుతున్నారు. కాకినాడలో జరిగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ రూరల్ మండలాల్లో సోమవారం హడావుడిగా పర్యటించారు. తడిసి ముద్దయిన ధాన్యాన్ని పరిశీలించారు. ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడానికి బదులు వరి కోతల ప్రారంభంలోనే ధాన్యం కొనుగోళ్లు, రైతుకు మద్దతు ధర దక్కేటట్లు చూసి ఉంటే తమకు మేలు జరిగేదని రైతులు వాపోతున్నారు.
బస్తాకు రూ.500 వరకూ నష్టం
వరి కోతల ప్రారంభంలో ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం గాలికొదిలేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కనీస మద్దతు ధర 75 కేజీల బస్తాకు రూ.1,750 ఉండగా, ప్రస్తుత పరిస్థితుల్లో రూ.1,300 నుంచి రూ.1,450కే అమ్ముకున్నారు. ప్రభుత్వ నిర్వాకంతో బస్తాకు రూ.400 నుంచి రూ.500 వరకూ నష్టపోయారు. ఇప్పుడు మిగిలిన పంట ఒబ్బిడి చేసుకుందామనేసరికి అకాల వర్షాలు దెబ్బ తీశాయి. జిల్లాలో ఇప్పటి వరకూ 3.4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ లెక్కన ఇంకా 2.23 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉంది. ప్రభుత్వం ముందుగానే ధాన్యాన్ని కొనుగోలు చేసి ఉంటే అకాల వర్షాల ముప్పు నుంచి బయటపడే వారమని రైతులు విలపిస్తున్నారు. ఈ వర్షాలకు పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, కరప, కాకినాడ రూరల్, తాళ్లరేవు, పెదపూడి, జగ్గంపేట, గండేపల్లి తదితర మండలాల్లో ధాన్యం తడిసిపోయింది. దాదాపు ప్రతి మండలంలోనూ ఆరేడు వందల మెట్రిక్ టన్నుల ధాన్యం కళ్లాలు, రోడ్లపై ఉంది. తడిసిన ప్రతి గింజా కొనుగోలు చేస్తున్నామని మంత్రి నాదెండ్ల చెబుతుండగా.. క్షేత్ర స్థాయిలో మాత్రం తేమ 18 శాతం దాటిన ధాన్యాన్ని కూడా మిల్లర్లు కొనుగోలు చేయని పరిస్థితి నెలకొంది. అకాల వర్షాలతో తడిసిన ధాన్యంలో తేమ 20 శాతం పైనే ఉంది. కొన్నిచోట్ల 23 శాతం కూడా కనిపిస్తోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై కాకినాడ కలెక్టరేట్‌లో సోమవారం రాత్రి జరిపిన సమీక్షలో తేమ 22 శాతం ఉన్నా కొనుగోలు చేయాలని మిల్లర్లకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇవి ఎంతవరకూ అమలవుతాయో వేచి చూడాలి.
నియోజకవర్గాల వారీగా..
జగ్గంపేట నియోజకవర్గంలో రైతులు 21,209 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించగా, మరో 5,440 మెట్రిక్ టన్నులు రోడ్ల పైన, కళ్లాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది.
కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అకాల వర్షాలకు 830 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిపోయింది. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ నియోజకవర్గంలో బహిరంగ మార్కెట్‌లో 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వచ్చింది.
పెద్దాపురం నియోజకవర్గంలో 40 వేల ఎకరాల్లో వరి సాగు జరిగింది. లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. కనీస మద్దతు ధర దక్కకపోగా 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు కమీషన్ ఏజెంట్లకే అమ్ముకోవాల్సి వచ్చింది. మరో 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కళ్లాల్లోనే తడిసిపోయింది.
ప్రత్తిపాడు నియోజకవర్గంలో 29,960 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. దీనిలో 10,800 మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాల్లో అమ్మగా బయట వ్యక్తులు 18 వేల టన్నులు కొనుగోలు చేశారు. మిగిలిన ధాన్యం వర్షానికి తడిసిముద్దయ్యింది.
పిఠాపురం నియోజకవర్గంలో 1,147 మెట్రిక్ టన్నుల ధాన్యం వర్షంలో తడిసిపోయిందని అధికారులు చెబుతున్నారు. అయితే, రైతులు చెబుతున్న అంచనాలను బట్టి తడిసిన ధాన్యం 2,500 మెట్రిక్ టన్నుల వరకూ ఉంది.
తుని నియోజకవర్గంలో 4,600 మెట్రిక్ టన్నుల ధాన్యం రోడ్ల పైన, కళ్లాల్లో ఉంది.
వైఎస్సార్ సీపీ హయాంలో..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో తడిసి ముద్దయిన ధాన్యాన్ని సైతం అధికారులే దగ్గరుండి మరీ కొనుగోలు చేయించారు. వరి కోతలు మొదలవుతాయనగానే అప్పట్లో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ముందుగానే ప్రారంభించింది. తడిసిన ధాన్యంలో తేమ శాతం 18, 20.. ఇలా ఎంత ఉన్నా కళ్లాల్లోనే కొనుగోలు చేసింది. నేరుగా పౌర సరఫరాలు, రెవెన్యూ అధికారులు బృందాలుగా కళ్లాల్లోకి వెళ్లి, తూకాలు వేయించి ట్రాక్టర్ల పైకి ఎక్కించి మిల్లులకు తోలిన రోజులను రైతులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని మండిపడుతున్నారు.
నష్టపరిహారం ఇవ్వాలి
నేను మూడెకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాను. ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకూ పెట్టుబడి అయింది. వరి చేను కోసి, ధాన్యం రాశులుగా పోశాను. అమ్ముకుందామంటే బస్తా రూ.1,300కు మాత్రమే అడుగుతున్నారు ఇంతలో అకాల వర్షంతో ధాన్యమంతా తడిసిపోయింది. దీనిని కొనే నాథుడు లేక ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఆదుకోవాలి. నష్టపరిహారం ఇప్పించాలి. – దడాల గురయ్య, పాత కోదాడ, తొండంగి మండలం
ప్రభుత్వ తీరుతోనే ఈ దుస్థితి
నేను 17 ఎకరాల్లో వరి సాగు చేశాను. 14 ఎకరాలు కోత కోసి ధాన్యం ఆరబెట్టాను. వర్షం కారణంగా ఇది మొత్తం తడిసి ముద్దయ్యింది. మరో నాలుగెకరాల్లో వరి పంట నేల నంటింది. ఎకరాకు రూ.30 వేలు పైగా పెట్టుబడి పెట్టాను. తడిసిన ధాన్యం అమ్మితే చాలా నష్టం వస్తుంది. ధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడం, మిల్లర్లు ధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు చేయనందు వల్లనే మాకు ఈ దుస్థితి ఏర్పడింది.
– శాంతా సత్తిబాబు, కాట్రావులపల్లి, జగ్గంపేట
ధాన్యం తడిసి ముద్దయ్యింది
దాళ్వాలో రెండెకరాలు సొంతంగా, మూడెకరాలు కౌలుకు వరి సాగు చేశాను ఎకరాకు రూ.35 వేల వరకూ పెట్టుబడి పెట్టాను. ఎకరాకు 50 బస్తాల దిగుబడి వచ్చింది. ఆదివారం కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయ్యింది. పొలంలోకి వర్షపు నీరు చేరడంతో సురక్షిత ప్రదేశాలకు ధాన్యం చేర్చడానికి ఎకరాకు రూ.4 వేల నుంచి రూ.5 వేలు అవుతుంది. ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రకటించినా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనడం లేదు. అయినకాడికి దళారులకు అమ్ముకోవలసిన దుస్థితి ఏర్పడింది. ఇప్పుడు ధాన్యం తడిసిపోవడంతో ధర మరింత తగ్గే పరిస్థితి ఏర్పడింది.
– వెలమర్తి బుల్లిరాజు, రైతు, వీకే రాయపురం, సామర్లకోట మండలం
ప్రభుత్వం ఆదుకోవాలి
ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేక, పంటకు గిట్టుబాటు ధర లేక వరి రైతులు చాలా ఇబ్బందులకు గురయ్యారు. మద్దతు ధర, ధాన్యం సేకరణ విషయంలో కాలయాపన వలన అకాల వర్షం కూడా రైతులకు మరింత నష్టం కలిగించింది. అకాల వర్షాలకు పిఠాపురం నియోజకవర్గంలో రైతులు, కౌలు రైతులకు చెందిన సుమారు 530 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిపోయి, నష్టం వాటిల్లింది. ఇంకా మామిడి, అరటి, ఇతర రైతులు కూడా కష్టాల్లో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే తడిసిన ధాన్యం కొనుగోలు చేసి, రైతులను ఆదుకోవాలి.
– వంగా గీత, మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి, పిఠాపురం
ప్రభుత్వం సకాలంలో కొనకే..
రబీలో ఆరెకరాలు సాగు చేశాను. ఎకరాకు రూ.40 వేల వరకూ పెట్టుబడి అయింది. పంట కోత కోసి, ధాన్యం రాశి చేసి ఉంచాను. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనలేదు. మిల్లర్లకు అమ్ముదామంటే 75 కిలోల బస్తా రూ.1,550కి తీసుకుంటామన్నారు. గత్యంతరం లేక రాశి పైనే ధాన్యం ఉంచి వేచి చూస్తే వర్షానికి తడిసి ముద్దయ్యింది. ఇప్పుడు మిల్లర్లకు అమ్ముదామంటే 75 కిలోల బస్తా రూ.1,450కి అడుగుతున్నారు. బస్తాకు రూ.275 నష్టపోవాల్సి వస్తోంది. ప్రభుత్వ మద్దతు ధర రూ.1,725కు కొనుగోలు చేయాలి. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో రూ.77,550 నష్టం వస్తోంది. ప్రభుత్వం, అధికారులు స్పందించి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనేలా చర్యలు తీసుకోవాలి. లేకపోతే అప్పుల పాలవుతాం.
– వెలుగుబంట్ల రవినాయుడు,రైతు,
కూరాడ, కరప మండలం
అదనపు ఖర్చులు తప్ప లాభం లేదు
దాళ్వాలో నాలుగెకరాలు సొంతంగా, 11 ఎకరాలు కౌలుకు తీసుకుని బీపీటీ (సన్నాలు) రకం వరి సాగు చేశాను. ఎకరాకు రూ.33 వేల పెట్టుబడి పెడితే 32 బస్తాల దిగుబడి వచ్చింది. కోత కోసిన వెంటనే గిట్టుబాటు ధర కంటే తక్కువకు రూ.1,350 వంతున మిల్లుకు పంపితే, తేమ శాతం ఎక్కువంటూ తీసుకోలేదు. తిరిగి ధాన్యం వెనక్కి తీసుకువచ్చి ఆరబెట్టిన తర్వాత మిల్లుకు పంపితే గిట్టుబాటు ధర రూ.1,750కి తీసుకున్నారు. టాక్టర్ కిరాయి రూ.5 వేలు, బస్తాకు రూ.65 వంతున ఎకరాకు రూ.2,080 వెరసి రూ.7,080 అదనపు ఖర్చయ్యింది. మిల్లర్లు వెంటనే ధాన్యం తీసుకుంటే సరేసరి. లేకుంటే ట్రాక్టరుకు రోజుకు రూ.5 వేల వంతున అదనంగా కిరాయి చెల్లించాలి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో న్యాయం జరగడం లేదు. గత ప్రభుత్వంలో ఈ దుస్థితి లేదు. పండిన పంటకు గిట్టుబాటు ధర, రైతు భరోసా అందేవి.
– సీంద్రపు భాస్కరరావు, రైతు, ప్రత్తిపాడు

సర్కారు వారి నిర్లక్ష్యం.. అన్నదాతకు శాపం

సర్కారు వారి నిర్లక్ష్యం.. అన్నదాతకు శాపం

సర్కారు వారి నిర్లక్ష్యం.. అన్నదాతకు శాపం

సర్కారు వారి నిర్లక్ష్యం.. అన్నదాతకు శాపం

సర్కారు వారి నిర్లక్ష్యం.. అన్నదాతకు శాపం

సర్కారు వారి నిర్లక్ష్యం.. అన్నదాతకు శాపం

సర్కారు వారి నిర్లక్ష్యం.. అన్నదాతకు శాపం